2025లో టాప్ సెలబ్రిటీల విడాకులు
ఇదే ఏడాది ఆరంభంలో ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ స్థానిక కోర్టులో పీటర్ హాగ్ పై విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురయ్యానని జైట్లీ ఆరోపించారు.;
వెండితెరపై జంటల రొమాన్స్ ఎంతో ముచ్చటగొలుపుతుంది. కానీ రియాలిటీలో అలాంటి ముచ్చట కలకాలం నిలబెట్టుకోవడానికి చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల జంటల మధ్య వివాదాలు, బ్రేకప్ వ్యవహారాలు నిజంగా అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రజలు విపరీతంగా ఆరాధించే సెలబ్రిటీ జంటల బ్రేకప్ వ్యవహారాలు జీర్ణించుకోలేనివి. ఇలాంటి ఘటనలతో 2025 తీపి చేదు గుళికల మిశ్రమంగా చెప్పుకోవాలి. భాగస్వాముల నుండి విడిపోయిన సినీ సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే..
ఈ ఏడాది అత్యధికంగా చర్చల్లోకి వచ్చిన జంట ధనశ్రీ వర్మ- యజ్వేంద్ర చాహల్. ఈ జంట తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కేవలం మూడు నాలుగేళ్లకే విడిపోవడం జీర్ణించుకోలేనిది. కానీ బ్రేకప్ తప్పలేదు. కొన్ని నెలల పాటు విడివిడిగా నివసించిన తర్వాత, ఈ జంట ఫిబ్రవరి 2025లో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివాహేతర సంబంధాలపై రకరకాల ఊహాగానాల తర్వాత ఈ జంట తమ విడాకులను ఖరారు చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత, పాడ్‌కాస్ట్‌లలో తమ వైపు వాదనను వినిపిస్తూ, తమ బంధంలో ఏర్పడిన బీటల గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఈ జోడీ నిశ్శబ్ధంగా ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయ్యారు.
తమన్నా భాటియా -విజయ్ వర్మ జంట ప్రేమాయణం, బ్రేకప్ గురించి చాలా ఎక్కువ చర్చ సాగింది. అయితే ఈ జంట 2025 ప్రారంభంలో విడిపోవడానికి ముందు వినోద పరిశ్రమలో ఆదర్శ జంటగా అభిమానుల హృదయాల్లో నిలిచి ఉన్నారు. కలిసి ఒక సినిమాలో పనిచేసిన తర్వాత ఒకరికొకరు దగ్గరయ్యారు. 2023లో ఈ ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అయితే వారు విడిపోయిన తర్వాత కూడా స్నేహపూర్వకంగానే ఉన్నామని, కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కథనాలొచ్చాయి.
సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ - క్రికెటర్ స్మృతి మంధాన నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన వార్తలు మీడియా హెడ్ లైన్స్ లో హైలైట్ అయ్యాయి. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ వేడుకలు సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ఈ జంట అన్యోన్యతకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్‌లు కూడా వైరల్ అయ్యాయి. ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి చాలా అందమైన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ అకస్మాత్తుగా స్మృతి మందన తండ్రికి గుండె పోటు వచ్చిందనే వార్తలు వచ్చాయి. కుటుంబంలో తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఈ జంట తమ వివాహాన్ని రద్దు చేసుకుందనే వార్తలు ఆశ్చర్యపరిచాయి. స్మృతిని పలాష్ మోసం చేసాడనే పుకార్లు వచ్చినా వాటిని అతడు సోషల్ మీడియాలో ఖండించారు. ఈ పెళ్లిలో చాలా ట్విస్టులు ఆశ్చర్యపరిచాయి. ప్రారంభంలో చాలా మంది వివాహం వాయిదా పడిందని అనుకున్నారు. కానీ ఈ జంట చివరికి వివాహం అధికారికంగా రద్దు అయిందని ధృవీకరించారు.
ఇదే ఏడాది ఆరంభంలో ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ స్థానిక కోర్టులో పీటర్ హాగ్ పై విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురయ్యానని జైట్లీ ఆరోపించారు. తన భర్త లైంగికంగా వేధించారని కూడా ఫిర్యాదు చేసారు. తన పిల్లలను కలవనీకుండా చేస్తున్నాడని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సదరు నటి తన భర్తపై గృహ హింస, క్రూరత్వం, మోసం ఆరోపణలు చేస్తూ కేసులు వేశారు. కోర్టుకు సమర్పించిన తన పిటిషన్‌లో అతడు తనను వృత్తిని తిరిగి చేపట్టనీయకుండా చేసాడని ఆరోపించారు. అతడు ఒక నార్సిసిస్టిక్.. కోపం ఎక్కువ.. మద్యపాన అలవాట్లు ఉన్నాయి అని తీవ్ర ఆరోపణలు చేసారు. అతడి కారణంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టుల పరిధిలో విచారణలో ఉంది.