ట్రైలర్ టాక్: గ్రీకు పురాణంపై నోలాన్ భారీ ప్రయోగం
ఏదైనా ప్రయోగం చేయాలంటే చాలా గట్స్ కావాలి. సాంకేతికంగా ప్రయోగాలు చేయాలంటే దానికి అపారమైన జ్ఞానం అవసరం.;
ఏదైనా ప్రయోగం చేయాలంటే చాలా గట్స్ కావాలి. సాంకేతికంగా ప్రయోగాలు చేయాలంటే దానికి అపారమైన జ్ఞానం అవసరం. గట్స్- జ్ఞానం కలబోత- క్రిస్టోఫర్ నోలాన్. ఈ సృజనాత్మక ఫిలింమేకర్ తన కెరీర్ లో లెక్కలేనన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. మెమెంటో మొదలు బ్యాట్ మేన్, ఇన్ సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్, టెనెట్, ఓపెన్ హీమర్ వరకూ అతడు చేయని ప్రయోగం లేదు. ప్రతిసారీ స్క్రిప్టు, స్క్రీన్ ప్లేలతో పాటు సాంకేతికతతో అతడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు అతడు మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అయితే తన ప్రయోగానికి అతడు ఎంచుకున్న సబ్జెక్ట్ సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. ఇప్పుడు అతడు గ్రీకు పురాణాలపై ప్రయోగం చేస్తున్నాడు. ది ఒడిస్సీ అనేది టైటిల్. తాజాగా మొదటి ట్రైలర్ విడుదలైంది. కొన్ని గంటల్లోనే కోటి పైగా వ్యూస్ ని అందుకుంది ఈ ట్రైలర్. ఇక నోలాన్ కి భారతదేశంలోను అసాధారణ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారతీయ అభిమానులు ట్రైలర్ గురించి చాలా ముచ్చటిస్తున్నారు.
గ్రీకుల పురాణేతిహాసం నుండి ప్రేరణ పొందిన కథను అతడు ఎంచుకోవడం నిజంగా ఒక వండర్. ట్రోజన్ యుద్ధం తర్వాత ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నించే క్రమంలో చిత్రకథానాయకుడు మాట్ డామన్ ఒక పెద్ద ప్రమాదంలో పడతాడు. ఒడిస్సియస్ అనే ప్రమాదకరమైన ప్రయాణంలో చాలా ఏళ్ల పాటు అక్కడే ఉండిపోతాడు.. కానీ తిరిగి ఇంటికి రాలేని దుస్థితి.. తన తండ్రిని ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకు వస్తానని వీరుడైన కుమారుడు తల్లికి ప్రామిస్ చేయడం చూస్తుంటే, ఇందులో తండ్రి -కొడుకు, తల్లి- కొడుకు నడుమ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉండనుంది. గ్రీకు పురాణాలు భారతీయ పురాణాల కంటే భిన్నమైనవి అయినా, మనసులపై ఘాడమైన ముద్ర వేసే విరోచిత పోరాటాలు సాహసాలు ఈ కథల్లో ఉన్నాయి. అందుకు ది ఒడిస్సీ భారీ వారియర్ డ్రామాగాను అలరించబోతోందని అర్థమవుతోంది.
ముఖ్యంగా ఒక రెగ్యులర్ పురాణ కథను ఎంపిక చేసుకున్నా ఇందులో నోలాన్ మార్క్ స్పష్ఠంగా కనిపిస్తే అది ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఊహించగలం. నోలన్ సిగ్నేచర్ స్టైల్ స్టోరి టెల్లింగ్ ఈ సినిమాకి ప్రధాన బలం కానుంది. నోలాన్ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాలో కూడా డార్క్ థీమ్ ఉత్కంఠను పెంచుతోంది. సముద్రాలు, అడవులలో సాగే యుద్ధాల కథలతో రహస్య మాన్ స్టర్ ల పుట్టుక, భీభత్సానికి సంబంధించిన విజువల్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాయి. ఇది పురాణేతిహాసానికి సంబంధించిన కథ కాబట్టి ఫిక్షన్ పాత్రలు కూడా మతులు చెడగొడతాయి. హీరో ఒంటరితనం- అన్వేషణ- పోరాటాల కథను నోలాన్ తనదైన శైలిలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ సినిమాని నోలన్ ఐమ్యాక్స్ లెన్స్ తో చిత్రీకరించాలనుకోవడం ప్రత్యేకతను ఆపాదిస్తుంది. మనం ఒక అద్భుతమైన గ్రహంపై ఉన్నామా? అనిపించేంత డెప్త్ తో థియేటర్ లోని ప్రేక్షకుల మనసులపై ఈ సినిమా ముద్ర వేస్తుందని కూడా ట్రైలర్ చెబుతోంది. ముఖ్యంగా సరుగుడు తోటలో మాన్ స్టర్ తో హీరో పోరాటానికి సంబంధించిన విజువల్ మైండ్ డిస్ట్రబింగ్ గా కనిపిస్తోంది.
డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, చార్లిజ్ థెరాన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఒక చారిత్రాత్మక పురాణేతిహాస కథను తెరపై ఆవిష్కరించడానికి చాలా మంది దర్శకులు ఉన్నారు.. కానీ వారి కోసం జనం థియేటర్లకు వెళ్లరు. నోలాన్ మార్క్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూడటం కోసమే చాలా మంది ఎదురు చూస్తారు.