సీఎంతో భేటీకి నాకు మాత్రమే ఆహ్వానం అందింది: చిరంజీవి

Update: 2022-02-10 05:57 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీ సమస్యల మీద గురువారం ముఖ్యమంత్ర్రి సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈరోజు స్పెషల్ ఫ్లైట్ లో టాలీవుడ్ పెద్దలు అమరావతికి పయనమయ్యారు. చిరంజీవితోపాటు మహేష్‌ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ సమావేశానికి వెళ్తున్నారు.

అలానే వైసీపీ మద్దతుదారులైన నటుడు అలీ - పోసాని కృష్ణమురళీ - ఆర్ నారాయణ మూర్తి వంటి వారు ఇప్పటికే విజయవాడ చేరకున్నారని సమాచారం. అయితే సీఎంతో భేటీ కోసం వెళ్ళడానికి ముందు బేగంపేట్ ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్వ్యాఖ్యలు చేశారు. సీఎంఓ నుంచి తనకు మాత్రమే ఆహ్వానం అందిందని.. మిగతా ఎవరెవరు వస్తున్నారో తనకు తెలీదు చూద్దాం అని అన్నారు.

''సీఎంఓ నుంచి నాకు మాత్రమే ఆహ్వానం అందిందని తెలిసింది. నాతో పాటుగా ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. మీడియాలో వస్తున్న కథనాలు చూసే మిగతా విషయాలు తీసుకున్నాను. సీఎంను కలిసిన తర్వాత మాట్లాడతా. ఈరోజు అన్నిటికి శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నా'' అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సీఎంఓ నుంచి తనకు మాత్రమే ఆహ్వానం అందిందని చిరంజీవి చేసిన కామెంట్స్ చర్చనీయంగా మారారు.

ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు రావాలనేది సీఎంఓ డిసైడ్ చేసి లిస్ట్ పంపిందా? చిరు వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సీఎంతో చిరు ఒక్కరే సమావేశం అవడంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఫిలిం ఛాంబర్ - నిర్మాతల మండలి - 'మా' అసోసియేషన్ తరపున కాకుండా.. వ్యక్తిగతంగా వెళ్లడమేంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి జగన్ తో భేటీకి తనకు మాత్రమే ఇన్విటేషన్ వచ్చిందని అనడంతో ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం లేదా?, సమస్యలపై చర్చించడానికి ఏపీ సర్కారు వారికి నచ్చిన వారినే ఆహ్వానించారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ తో భేటీ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు ఇవాళ్టితో ఎండ్‌ కార్డ్‌ పడుతుంది అన్నారు. ఇండస్ట్రీకి మేలు జరిగే ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్యామిలీ నుంచి చిరంజీవి వెళ్తున్నారు కాబట్టి.. తాను వెళ్లాల్సిన అవసరం లేదని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. ఇకపోతే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎంతో సమావేశానికి వెళ్తారని ప్రచారం జరిగినా.. ఆయన వెళ్లడం లేదని తెలుస్తోంది.
Tags:    

Similar News