నిన్న పావలా శ్యామల.. నేడు పాకీజా.. పెద్దలు ఆలోచించాల్సిందే!
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నటి పావలా శ్యామలకు ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ఆర్థిక సహాయం చేశారు.;
గత కొంతకాలంగా కొంతమంది సినీ సెలబ్రిటీల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడం చూసి అందరిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో వీరు ఇన్ని రోజులు ఏం చేశారు అని కొంతమంది తమ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. వాస్తవానికి హీరోలకు, హీరోయిన్లకు ఇచ్చే రేంజ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ ఇవ్వరు అనేది వాస్తవం. ఇక వచ్చిన డబ్బును కుటుంబ పోషణకు, ఇతర ఖర్చులకు, పిల్లల స్కూల్ ఫీజులు , ఇంటి అవసరాలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో మరెన్నో. ఇకపోతే చాలీచాలని రెమ్యూనరేషన్ తో కెరియర్ ను కొనసాగదీస్తూ ఉంటారు.
ఇంకొంతమంది వచ్చిన డబ్బులోనే భవిష్యత్తు కోసం దాచుకొని చివరి క్షణాలలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా కెరియర్ ను కొనసాగిస్తుంటే.. మరికొంతమంది కుటుంబ సభ్యులకు కోసం సంపాదించిన డబ్బు మొత్తాన్ని వారికే కేటాయించి.. ఇలా చివరి క్షణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది అనారోగ్య స్థితిలో ఉంటూ డబ్బు సహాయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే అలా ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ఏకంగా స్వర్గస్తులవుతుంటే.. మరికొంతమంది దీనస్థితిలో రోడ్డున పడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నటి పావలా శ్యామలకు ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ఆర్థిక సహాయం చేశారు. అయితే రోజు రోజుకి ఆమె పరిస్థితి దిగజారడంతో హోమ్ నిర్వాహకులు తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో కూతురితో కలిసి ఆమె రోడ్డున పడింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమెను గమనించిన పోలీస్ సిబ్బంది ఏసిపి సహాయంతో వారిని వృద్ధాశ్రమంలో చేర్పించారు.
అయితే ఈ ఘటన మరువకముందే ఇప్పుడు ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న పాకీజా అలియాస్ వాసుకి కూడా నేడు వృద్ధాశ్రమంలో చేరారు. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నటి పాకీజాకు ఇప్పటికే మా అధ్యక్షుడు మంచు విష్ణు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, మోహన్ బాబు ఇలా ఎంతోమంది ఈమె దీనస్థితి చూసి చలించిపోయి ఆర్థిక సహాయం చేశారు. అయితే ఇప్పుడు ఈమె పరిస్థితి మరింత దిగజారినట్లు సమాచారం. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో నిర్వాహకుడు జల్లి కేశవరావు ఈమెకు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు.
ఇకపోతే సెలబ్రిటీలు ఇలా ఒకరి తరువాత ఒకరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి . నిజానికి సినీ ఇండస్ట్రీలో ఉండే కార్మికులకు,సినీ సెలబ్రిటీలకు ఏదైనా ఇబ్బందులు కలిగితే అండగా నిలవడానికి మా అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది. అలా సినీ పరిశ్రమకు సేవ చేసి.. చివరార్థంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే ఎంతోమంది ఇతరుల సహాయం కోసం ఎదురు చూడకుండా.. వీరికంటూ ఒక ప్రత్యేకమైన వసతిగృహాన్ని ఏర్పాటు చేసి.. స్టార్ సెలబ్రిటీలు, బడ దర్శక నిర్మాతలు తమ వంతు సహాయంగా ఈ వసతి గృహానికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తే భవిష్యత్తులో ఇలా సెలబ్రిటీలు రోడ్డున పడాల్సిన అవసరం ఉండదు అని కొంతమంది తమ అభిప్రాయంగా వ్యక్తపరుస్తున్నారు.
ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో విశేష సేవలు అందించి చివరార్థంలో ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆశ్రయం కల్పించడానికి ఒక చారిటీని కూడా నిర్వహిస్తే బాగుంటుంది అని కూడా కామెంట్ లు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి ఆలోచనపై సెలబ్రిటీల పరిస్థితులను అర్థం చేసుకొని సినీ పెద్దలు ఈ విషయంపై ఆలోచించాలి అని కూడా కోరుకుంటున్నారు.