హిందీ వాళ్ళు ఏ తెలుగు సినిమానీ వ‌ద‌లడం లేదు..!

Update: 2021-07-10 02:30 GMT
ఒక భాషలో హిట్ అయిన సినిమాల రైట్స్ తీసుకొని ఇతర భాషల్లోకి రీమేక్ చేయడమేనేది ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నదే. మంచి కంటెంట్ ని ప్రేక్షకులకు అందించాలానే ఉద్దేశ్యం ఒకటైతే.. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి సేఫ్ జోన్ లో ఉండొచ్చని నిర్మాతలు భావిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సక్సెస్ అవ్వగా.. మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగిలిపోతుంటాయి. ఈ మధ్య ఇండస్ట్రీలో రీమేక్‌ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. చాలామంది స్టార్ హీరోలు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇకపోతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెద్దదిగా చెప్పుకునే బాలీవుడ్.. ఇప్పుడు ఎక్కువగా రీమేక్ కథలనే నమ్ముకుంటోంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలపై హిందీ హీరోలు ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో తెలుగులో హిట్ కొట్టిన ఏ సినిమానూ హిందీ వాళ్లు వ‌ద‌లడం లేదు. కేవలం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలే హిందీలో రీమేక్ అవుతున్నాయి అనుకుంటే పొర‌పాటే అవుతుంది. స్టార్ హీరోల చిత్రాలతో పాటుగా చిన్న మీడియం హీరోలు తీసిన సినిమాలను కూడా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ - పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా రూపొందిన హిట్ సినిమా 'Rx 100'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమారుడు అహన్ ను హీరోగా పరిచయం చేస్తూ 'తడప్' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర్జున్ - పూజాహెగ్డే జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా 'అల వైకుంఠపురములో' ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించే ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ - కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ - మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

అలానే నాని హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ ''జెర్సీ'' చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని బాలీవుడ్ స్టార్ షాహిద్ క‌పూర్ రీమేక్ చేస్తున్నారు. తెలుగు 'జెర్సీ' ని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ - దిల్‌ రాజు - సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ - రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా రూపొందిన 'హిట్' సినిమాని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావ్ - 'దంగల్' బ్యూటీ సన్యా మల్హోత్రా ఈ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు 'హిట్' చిత్రానికి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ వెర్సన్ కు కూడా డైరెక్షన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - టీ సిరీస్ బ్యానర్స్ పై దిల్ రాజు - భూషణ్ కుమార్ - కిషన్ కుమార్ - కుల్దీప్ రాథోడ్‌ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News