హరనాథ్ అదృష్టం అలా మసకబారింది!

Update: 2021-05-30 06:30 GMT
హరనాథ్ .. అలనాటి అందాల కథానాయకుడు. మంచి హైటూ .. రంగు .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం హరనాథ్ సొంతం. రొమాంటిక్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన తొలి తరం హీరోల్లో హరనాథ్ ఒకరుగా కనిపిస్తాడు. నాజూకైన కథానాయకుడిగా అమ్మాయిల అభిమానాన్ని పొందడమే కాదు, వాళ్ల కలల నాయకుడిగా మారిపోయాడు. ఆ క్రేజ్ తోనే సినిమాకి .. సినిమాకి ఎదిగిపోయాడు.

ఒక వైపున ఎన్టీఆర్ ... మరో వైపున ఏఎన్నార్, ఇంకో వైపున కృష్ణ .. శోభన్ బాబు బరిలో ఉండగానే హరనాథ్ రంగంలోకి దిగాడు. అప్పట్లోనే హారనాథ్ తెరపై తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన నడక చాలా స్టైల్ గా ఉండేది. ఒక వైపున ముఖ్యమైన పాత్రలు .. మరో వైపున హీరోగా చేస్తూ ఆయన తన కెరియర్ ను సాగించారు. పౌరాణికాల్లో తాను ఇతర ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నప్పుడు, రాముడు ..  కృష్ణుడు .. విష్ణువు పాత్రలను హరనాథ్ తో ఎన్టీఆర్ చేయించేవారంటే ఆయన రూపం ఎంత ఆకర్షణీయమైనదో అర్థం చేసుకోవచ్చు.

అలా తన కెరియర్ ఒక రేంజ్ లో సాగుతుండగా, హరనాథ్ కి గల మద్యం అలవాటు మరింతగా పెరుగుతూ వెళ్లింది. ఎంతో హ్యాండ్సమ్ గా ఉండే ఆయన ఎప్పుడూ మత్తులోనే ఉండటం సన్నిహితులకు ఎంతో బాధను కలిగించింది. ఎవరు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోలేదు. మద్యం సేవించే ఆయన షూటింగుకు రావడం ఇతర ఆర్టిస్టులకు ఇబ్బందిని కలిగించింది. విపరీతంగా తాగడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దాంతో అవకాశాలు దూరమవుతూ వచ్చాయి. ఆ సమయంలో ఆయన ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అలా మద్యం కారణంగానే ఆయన మరణానికి చేరువయ్యాడు. మంచి అందగాడు .. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నవాడు అయిన హరనాథ్ కెరియర్, ఆ విధంగా దెబ్బతినడం ఆయన అభిమానులను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటుంది.       
Tags:    

Similar News