ధురంధర్-2 వీక్షించి పొగిడేసిన పాక్ ప్రధాని!
దురంధర్ 2 ఈ సీజన్ లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది బాక్సాఫీస్ వద్ద దాదాపు 1500 కోట్లు వసూలు చేసింది.;
దురంధర్ 2 ఈ సీజన్ లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది బాక్సాఫీస్ వద్ద దాదాపు 1500 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో పాకిస్తాన్ రాజకీయ నాయకుల పాత్రల గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద డిబేట్ నడుస్తోంది. భారతదేశాన్ని కాంగ్రెస్ పాలించే సమయంలో పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రవేశించిన భారతీయ స్పై ల గురించి అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఇందులో జమాల్ జమీల్ పాత్ర పాకిస్తాన్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినది. అయితే ఇందులో కల్పితం ఎక్కువ ఉందని ఆయన ఆవేదన చెందారు.
కానీ ఇప్పుడు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని చూసారట. తాజాగా ఈ చిత్రంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌లో ఈ చిత్రంపై నిషేధం ఉన్నా.. నవాజ్ షరీఫ్ ప్రత్యేకంగా ఈ సినిమా కాపీని తెప్పించుకుని మరీ వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఖలీద్ మొహమ్మద్ వెల్లడించారు. సినిమాలో తనను స్ఫూర్తిగా తీసుకుని తీర్చిదిద్దిన పాత్రను, ఆ పాత్రలో నటుడు మషూర్ అమ్రోహి కనబరిచిన నటనను ఆయన ఎంతో మెచ్చుకున్నట్లు సమాచారం.
జర్నలిస్ట్ ఖలీద్ గతంలోనే తాను లాహోర్‌లో ఈ సినిమాను విడుదలైన తొలిరోజే చూశానని సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా వెల్లడించారు. తాజాగా నవాజ్ షరీఫ్ కూడా సినిమాను పూర్తిగా చూసి ఆనందించారని పేర్కొంటూ ఆయన కుమార్తె మరియం నవాజ్ షరీఫ్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్‌లో వాస్తవ ఘటనలను ఎంతో ఉత్కంఠభరితంగా చూపించడంతో పాక్ రాజకీయ వర్గాల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిషేధాలు, వివాదాల నడుమ కూడా ఒక భారతీయ చిత్రం పాక్ అగ్రనేతను ఆకర్షించడం విశేషం. సినిమాలో చూపించిన రాజకీయ పరిణామాలు.. దేశాల మధ్య సంబంధాల చిత్రణ వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్లే ఆయన దీనిని వీక్షించినట్లు తెలుస్తోంది. నవాజ్ షరీఫ్ వంటి నేత ఈ చిత్రాన్ని అభినందించడం చిత్ర యూనిట్‌కు పెద్ద బూస్ట్‌గా మారింది. కేవలం వినోదమే కాకుండా.. సరిహద్దుల అవతల కూడా చర్చకు దారితీసిన చిత్రంగా `ధురంధర్-2` నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద సునామీ: 17 రోజుల్లోనే 1000 కోట్లు
భారతీయ సినీ చరిత్రలో `ధురంధర్-2` సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం కేవలం 17 రోజుల్లోనే భారతదేశంలో రూ.1000 కోట్ల (వరల్డ్ వైడ్ 1520కోట్లు) కలెక్షన్ల మైలురాయిని అధిగమించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఒక స్పై థ్రిల్లర్ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే ప్రథమం. సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను రిపీటెడ్ గా థియేటర్లకు రప్పిస్తున్నాయి.
ఈ భారీ విజయం భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్ సత్తాను మరోసారి చాటి చెప్పింది. కేవలం మల్టీప్లెక్స్‌లే కాకుండా సింగిల్ స్క్రీన్లలో కూడా `ధురంధర్-2` హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. భవిష్యత్ లో మరిన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ఆశిస్తున్నారు. అయితే బాహుబలి 2 రికార్డును టచ్ చేయాలంటే మరో 300 కోట్లు, దంగల్ రికార్డును టచ్ చేయాలంటే 500 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ వసూళ్ల జోరు తగ్గడంతో ఇది అంత సులువు కాదని కూడా ట్రేడ్ విశ్లేషిస్తోంది.