‘ఏమ‌య్యా.. ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిరిగేస్తావా..?’ బాలీవుడ్ హీరోపై ఎఫ్ ఐఆర్!

Update: 2021-02-20 11:30 GMT
ప్రేమికుల దినోత్స‌వం రాగానే.. ల‌వ‌ర్స్ మ‌ధ్య అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న ప్రేమ కాస్తా డ‌బుల్ ట్రిబుల్ అవుతుంది. అలాంటి రొమాంటిక్ సంద‌ర్భంలో పార్ట్ న‌గ‌ర్ ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? అది కూడా అబ్బాయికి అమ్మాయి బ‌హుమ‌తి ఇస్తే? అది కూడా ఓ సూప‌ర్ బైక్ అయితే..?? ఇంకేముంటుందీ.. అత‌గాడు గాల్లో తేలిపోవ‌డ‌మే త‌రువాయి!

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. తాజా వాలెంటైన్స్‌ డే సందర్భంగా వివేక్‌ భార్య ఆయనకు ఓ బైక్‌ని ప్ర‌జెంట్ చేసింది. దీంతో.. ఎంతో ఎగ్జ‌యిట్ గా ఫీలైన వివేక్‌.. అదే రోజు బైక్ పై శ్రీమతిని ఎక్కించుకొని ముంబై వీధుల్లో రౌండ్ల మీద రౌండ్లు వేశాడు.

అంతేకాదు.. త‌మ బైక్ జ‌ర్నీకి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు వివేక్‌. దీన్ని చూసిన పోలీసులు ఫైర్ అయ్యారు. వెంట‌నే ఫైన్ వేయ‌డ‌మే కాకుండా.. ఎఫ్ఐఆర్ కూడా న‌మోదు చేశారు! బైక్ పై తిరిగితే ఇంత శిక్షా.. అంటే ముంబైలోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల ప్ర‌కారం అది పెద్ద నేర‌మే!

బైక్ పై తిరుగుతున్న‌ప్పుడు వివేక్ హెల్మెట్ ధ‌రించ‌లేదు. అంతేకాదు.. మాస్క్ కూడా పెట్టుకోలేదు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ.. ముంబైలో మాత్రం అదుపులోకి రాలేదు. ఇంకా అక్క‌డ కొవిడ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మాస్కులేకుండా.. హెల్మెట్ ధ‌రించ‌కుండా బైక్ రైడ్ కు వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు, అటు రెగ్యుల‌ర్ పోలీసులు యాక్ష‌న్ తీసుకున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వారు ఛాలానా విధిస్తే.. కరోనా సమయంలో మాస్క్ లేకుండా తిరిగినందుకు ఎఫైఐఆర్‌ నమోదు చేశారు. ఉత్సాహంలో ప్ర‌ధాన‌మైన విష‌యాలు మ‌రిచిపోవ‌డంతో ఈ తిప్ప‌లు త‌ప్ప‌లేదు. కాగా.. వివేక్‌ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్‌లో కనిపించారు. కానీ.. ఈ చిత్రం ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేదు.


Tags:    

Similar News