అవకాశాలు అడగడానికి మొహమాటపడను: బ్రహ్మాజీ

Update: 2021-06-20 10:30 GMT
తెలుగులోని కేరక్టర్ ఆర్టిస్టులతో బ్రహ్మాజీ స్థానం ప్రత్యేకం. బ్రహ్మాజీ చాలా సీనియర్ ఆర్టిస్ట్ .. ఇప్పటికీ ఆయన హ్యాండ్సమ్ గానే కనిపిస్తూ ఉంటారు. చిత్రపరిశ్రమలో అందరితో సాన్నిహిత్యంగా మసలుకోగలిగిన అతికొద్దిమందిలో బ్రహ్మాజీ ఒకరు. తెరపైనే కాదు .. బయటకూడా బ్రహ్మాజీ చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. షూటింగులు ఉన్నప్పుడు సిన్సియర్ గా అవి పూర్తిచేయడం .. ఆ తరువాత సన్నిహితులతో సరదాగా గడపడం .. తనకి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిరావడం చేస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

" సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. సినిమాల్లోకి వెళతానని నేను చెప్పినప్పుడు మా వాళ్లు చాలా కంగారుపడ్డారు. మా నాన్నను ఒప్పించి 'మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాను. అక్కడి నుంచి బయటికి వచ్చిన తరువాత నటుడిగా నా జీవితం మొదలైంది. నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమా 'సిందూరం'. ఓ 20 ..  30 సినిమాలు చేసిన తరువాత పడవలసిన రోల్, నాకు కెరియర్ బిగినింగ్ లోనే పడిపోయింది. ఆ సినిమా వలన ఇప్పటికీ నేను గౌరవించబడుతున్నాను. అది నాకు చాలా సంతోషాన్నీ .. సంతృప్తిని కలిగించే విషయం.

నేను కామెడీ సినిమాల్లో చేస్తే ఆ తరువాత యాక్షన్ సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కాదు. యాక్షన్ సినిమాలు చేస్తే కామెడీ రోల్స్ ఇచ్చేవారు కాదు. అలాంటి సమయంలో మాత్రం నాకు బాగా తెలిసినవారికి కాల్ చేసి మంచి రోల్ ఉంటే ఇవ్వమని అడుగుతాను. ఇప్పటికీ ఏ దర్శకుడైనా ఒక మంచి సినిమాను తీశాడనిపిస్తే, ఆ దర్శకుడి ఫోన్ నెంబర్ సంపాదించి కాల్ చేస్తాను. నాకు తగిన రోల్ ఉంటే ఇవ్వమని అడుగుతూ ఉంటాను. ఈ విషయంలో నేను ఎంతమాత్రం మొహమాటపడను. మంచి పాత్రలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను" అని చెప్పుకొచ్చారు.    
Tags:    

Similar News