మళ్లీ డెబ్యూ డైరెక్టర్ల ఫైట్

Update: 2018-03-20 23:30 GMT
గత నెలన్నరగా టాలీవుడ్లో డెబ్యూ డైరెక్టర్ల హవా నడుస్తోంది. గత ఐదు వారాల్లో తెలుగు తెరకు ఆరేడుగురు కొత్త దర్శకులు పరిచయం కావడం విశేషం. ఫిబ్రవరి తొలి వారంలో ‘టచ్ చేసి చూడు’ సినిమాతో విక్రమ్ సిరికొండ.. ‘ఛలో’తో వెంకీ కుడుముల దర్శకులుగా అరంగేట్రం చేశారు. తర్వాతి వారం ‘తొలి ప్రేమ’తో వెంకీ అట్లూరి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాతి వారం ‘అ’తో ప్రశాంత్ వర్మ.. ‘మనసుకు నచ్చింది’తో మంజుల ఘట్టమనేని డెబ్యూ చేశారు. ఇక ‘ఏ మంత్రం వేసావె’తో పరిచయమైన శశిధర్ మర్రి కూడా కొత్తవాడే. గత వారం విడుదలైన ‘కిరాక్ పార్టీ’తో శరణ్ కొప్పిశెట్టి అరంగేట్రం చేశాడు.

ఇక ఈ శుక్రవారం ఒకరికి ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ‘ఎమ్మెల్యే’ను రూపొందించిన ఉపేంద్ర మాధవ్ కొత్త దర్శకుడే. ఇది ‘పటాస్’ తరహా ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ‘పటాస్’తో పరిచయమైన అనిల్ రావిపూడికి ఉపేంద్ర స్నేహితుడే. వీళ్లిద్దరూ కలిసి గతంలో ‘ఆగడు’ సహా మరికొన్ని సినిమాలకు పని చేశారు. అనిల్ లాగే కళ్యాణ్ రామ్ సినిమాతోనే ఇతనూ దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. మరి స్నేహితుడిలాగే ఉపేంద్ర కూడా తొలి సినిమాతో తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి. ఇక ఈ వారం రాబోయే మరో సినిమా ‘నీది నాది ఒకే కథ’తో వేణు ఉడుగుల అరంగేట్రం చేస్తున్నాడు. ఇతను తొలి ప్రయత్నంలో రియలిస్టిక్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. అతను డెప్త్ ఉన్న దర్శకుడిలా అనిపిస్తున్నాడు. మరి అతనెలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

Tags:    

Similar News