విడువమంటే పాముకు కోపం.. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం!

Update: 2021-07-12 02:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మ‌రి సృష్టించిన క‌ల్లోలం అంతా ఇంతా కాదు. ఇది ఒక రేంజులో ఆటాడుకుంటోంది. ముఖ్యంగా సినీరంగంలోని అన్ని వ్య‌వ‌స్థ‌లు అస్త‌వ్య‌స్త‌మ‌య్యాయి. తాజాగా సెకెండ్ వేవ్ నేప‌థ్యంలో సినిమా రంగంలో నిర్మాత‌లు-ఎగ్జిబిట‌ర్ల మ‌ధ్య చిచ్చు పెట్టిన‌ట్లైంది. క‌రోనా తొలి వేవ్ లో సినిమాల‌న్నీ ఓటీటీలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు దీర్ఘ కాలిక  లాక్ డౌన్ ప్ర‌ణాళిక‌ను కేంద్రం తెర‌పైకి తేవ‌డంతో ఓటీటీల‌కు మంచి బిజినెస్ అయింది.

అయితే సెకండ్ వేవ్ త‌రవాత‌ ప‌రిస్థితులు నిర్మాత‌ల‌కు వ్య‌తిరేకంగా క‌నిపిస్తున్నాయి.  ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరిచేందుకు అనుమ‌తులిచ్చిన సంగ‌తి తెసిందే. ఈ నేప‌థ్యంలో ఓటీటీల‌కు వ్య‌తిరేకంగా థియేట‌ర్ యాజ‌మాన్యాల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. అగ్ర  నిర్మాత‌లంతా ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు.దీంతో ఎగ్జిబిట‌ర్ల త‌ర‌పున తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గారు. కొంద‌రు దిగి వ‌చ్చినా ఇంకొంద‌రు మాత్రం ఓటీటీ డీల్స్ కి క‌ట్టుబ‌డి ఉన్నార‌ట‌. దీంతో ఎగ్జిబిట‌ర్లంతా శ‌మ‌ర‌శంఖం పూరించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.

ఎట్టి ప‌రిస్థితుల్లో  అగ్ర హీరోల చిత్ర‌ల‌న్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారుట‌. త‌మ‌ని కాద‌ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తే టైమ్ చూసుకుని దెబ్బ కొడ‌తామని అల్టిమేటం జారీ చేసిన‌ట్లు క‌థ‌నాలొస్తున్నాయి. త‌మ దారికి రాకుంటే  థియేట‌ర్ల‌న్నీ మూసేసి నిర‌స‌న తెలుతామ‌ని మండిప‌డుతున్నారుట‌. థియేట‌ర్ల‌ను కళ్యాణ మంట‌పాలు చేస్తామ‌ని హెచ్చ‌రించార‌ని కూడా గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ క‌రోనా పూర్తిగా తొల‌గిపోయి సాధార‌ణ ప‌రిస్థితులొచ్చి సినిమాలు రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప‌ట్టుబ‌ట్టినా థియేట‌ర్లు తెర‌వ‌బోమ‌ని దీర్ఘ కాలిక ప్ర‌ణాళిక‌తో ముందుకు క‌దులుతున్న‌ట్లు స‌మాచారం. విడువమంటే పాముకు కోపం క‌ర‌వ‌మంటే  క‌ప్ప‌కు కోపం! అన్న చందంగా ఉందీ ప‌రిస్థితి. అంతిమంగా మ‌ధ్య‌లో న‌లిగిపోతున్న‌ది మాత్రం కోట్లు పెట్టిన నిర్మాత అని అర్థ‌మ‌వుతోంది.
Tags:    

Similar News