ఆలీ ‘చాట’ స్టోరీ ఏంటి?

Update: 2018-03-18 12:30 GMT
తెలుగు సినిమాల కామెడీ చరిత్రలో ఆలీది ప్రత్యేక అధ్యాయం. ఎన్నో వందల పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించాడతను. ఐతే వాటిలో ఆలీ ‘చాట’ కామెడీ మరీ ప్రత్యేకం. తనకంటూ ఒక ప్రత్యేక భాషనే క్రియేట్ చేసుకుని అద్భుతమైన కామెడీ పండించాడు ఆలీ. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో ఆలీ మాట్లాడే ‘చాట’ భాష ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. మరి ఆ ‘చాట’ కథేంటి.. ఆ భాష అసలు ఎలా పుట్టింది.. ఒక ఇంటర్వ్యూలో ఈ విశేషాలు వెల్లడించాడు ఆలీ. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

‘‘మగాడు సినిమా షూటింగ్ కోసం కేరళలోని ఎర్నాకులం వెళ్లాం. ఒక రోజు షూటింగ్ అయ్యాక హోటల్‌ కు బయల్దేరాను. హోటల్ పేరు గుర్తు లేదు. దగ్గర్లో ఒక మార్కెట్ ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. ఆటో పిలిచి మార్కెట్ గురించి చెబితే.. ‘ఎన్న శాట మార్కెట్.. అడ్రస్ ఇల్లిల్లో’ అంటూ ఏదో మాట్లాడాడు. అర్థం కాలేదు. ‘ఆ శాటే..’ అనేసి ఆటో ఎక్కేశా. వాడు ఊరంతా తిప్పేశాడు. చివరికి సినిమావాళ్లు దిగే హోటల్ అని వచ్చీ రాని భాషలో చెబితే కరెక్టుగా ఆ హోటల్ కే తీసుకెళ్లాడు. కొన్ని రోజులు అక్కడే తిరగడంతో ఆ భాష కొంచెం అలవాటైంది. ‘జంబలకిడి పంబ’ షూటింగ్ సందర్భంగా రచయిత దివాకర్ బాబు గారు మాటలు రాస్తుండగా.. ఆ సినిమాలో నటిస్తున్న చంద్రిక ఓ మలయాళ సినిమా చేస్తోందని తెలిసి ‘ఎవడే చంద్రిక.. ఎవడే పైలిల్లో’ అన్నాను. దాన్ని ఆయన సినిమాలో వాడేశారు. ఆ తర్వాత ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో నా పాత్రకు డైలాగులే రాయకుండా నాకు తెలిసిన మలయాళంలోనే డైలాగులు చెప్పమన్నారు. చెప్పేశా. సెట్లో ఉన్న వాళ్లంతా నవ్వుకున్నారు. అలా ‘చాట’ భాష సినిమాలోకి వచ్చింది’’ అని ఆలీ తెలిపాడు.
Tags:    

Similar News