ఫాంటసీ కామెడీతో వస్తున్న రాకాస.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ డీల్
మెగా కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా తన రెండో సినిమా ‘రాకాస’తో బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేసేలా కనిపిస్తున్నారు.;
మెగా కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా తన రెండో సినిమా ‘రాకాస’తో బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేసేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న ఈ ఫాంటసీ కామెడీ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ ఉండటంతో, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి మరీ హక్కులను కొనుగోలు చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా సుమారు 350కి పైగా స్క్రీన్లలో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై జీ స్టూడియోస్‌తో కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధించి సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా ‘మ్యాడ్’ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగీత్ శోభన్, ఈ సినిమాలో తన మార్కు కామెడీతో అలరించబోతున్నాడని ప్రమోషన్లు చూస్తుంటే అర్థమవుతోంది.
సినిమా విడుదలకు ముందే డిజిటల్ ఆడియో హక్కుల విషయంలో కూడా ‘రాకాస’ సత్తా చాటింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా, ఆడియో హక్కులను సరిగమ మ్యూజిక్ దక్కించుకుంది. అనుదీప్ దేవ్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ‘రపప్ప’, ‘పదే పదే’ వంటి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. సంగీతపరంగా సినిమాకు మంచి ఆదరణ లభించడం బిజినెస్ పరంగా చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.
వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి భారీ తారాగణం ఉండటం వల్ల వినోదానికి ఎక్కడా లోటుండదని తెలుస్తోంది. హారర్, ఫాంటసీ అంశాలను కామెడీకి జోడించి దర్శకురాలు మానస శర్మ ఈ కథను కొత్తగా తెరకెక్కించారు. ఏప్రిల్ 2వ తేదీనే అమెరికా, యూకే వంటి దేశాల్లో ప్రీమియర్లు పడబోతున్నాయి. ప్రత్యాంగిర సినిమాస్ నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు.
ఇక నిహారిక నిర్మాతగా తన మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’తో సక్సెస్ అందుకున్న జోరును ఇప్పుడు ‘రాకాస’తో కూడా కొనసాగించేలా కనిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ ఫాంటసీ డ్రామా ఎటువంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. కేవలం రెగ్యులర్ కథతో కాకుండా, బలమైన విజువల్స్ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో థియేటర్లకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎటువంటి కొత్త అనుభూతిని ఇస్తుందో వేచి చూడాలి.