#ఉగాది 2021 కానుక‌.. వైజాగ్ ఫిలిమ్ ఇండ‌స్ట్రీపై సీఎం ప్ర‌క‌ట‌న‌?

Update: 2021-04-10 05:05 GMT
ఏపీ-తెలంగాణ డివైడ్ త‌ర్వాత వైజాగ్ లో ఏపీ టాలీవుడ్ అభివృద్ధి చెందుతుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ రాజ‌ధానిపై స‌రైన క్లారిటీ రాక‌పోవ‌డంతో దాని గురించిన స‌రైన ప్ర‌స్థావ‌నే లేదు. ఇటీవ‌లి ఎన్నిక‌ల అనంత‌రం మ‌రోసారి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ గురించి వైజాగ్ టాలీవుడ్ గురించిన‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ్రేట‌ర్ విశాఖ‌లో పాగా వేసి ఉన్న తెలుగు దేశం పార్టీ బ‌లాన్ని అమాంతం త‌గ్గించేస్తూ జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైకాపా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. అనంత‌రం ప‌ట్ట‌ణ అభివృద్ధికి శ‌ర‌వేగంగా డీపీఆర్ ల‌ను సిద్ధం చేయించ‌డం స‌హా టౌన్ అభివృద్ధిలో భాగంగా వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీ అభివృద్ధి పైనా ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని లీకులు అందుతున్నాయి. విశాఖ‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ద‌డంతో పాటు విశాఖ‌- భోగాపురం మెట్రో లైన్ పైనా.. బీచ్ రోడ్లు వంతెన‌లు ట్రామ్ ట్రెయిన్ పైనా వైకాపా ప్ర‌భుత్వం పూర్తిగా దృష్టి సారించింది. ఆ మేర‌కు చ‌క‌చ‌కా ప‌నుల్ని ప్రారంభించి శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయ‌ని తెలిసింది.

అలాగే విజ‌య‌వాడ కేంద్రంగా ఉన్న ఏపీ- ఎఫ్ డీసీ (సినిమా టీవీ రంగ‌ పురోభివృద్ధి విభాగం) కి ప్ర‌పోజ‌ల్స్ ఉన్నాయా? అన్న ప్ర‌శ్న‌కు తాజాగా స‌మాధానం ల‌భించింది.

ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ లో బలోపేతం చేయడానికే జ‌గ‌న్ సార‌థ్యంలోని వైకాపా ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతుంది. గతంలో ఎప్పుడో సినీ పరిశ్రమ కోసం  కేటాయించిన భూమిని కూడా సినీ వర్గాలకే కేటాయించాలని నిర్ణయించారు. ఆ  భూమిని స్టూడియో లకు హౌసింగ్ పర్పస్ ఇవ్వాలని నిర్ణయించారు. కొందరు సినీ ప్రముఖులు భారీ స్టూడియోల నిర్మాణం కోసం ఇదివ‌ర‌కూ ల్యాండ్ కోసం ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దానికి అనుమ‌తుల కోసం వేచి చూస్తున్నార‌ని తెలిసింది.

తాజా స‌మాచారం మేర‌కు స్టూడియోల నిర్మాణానికి సంబంధించి రేపు ఉగాది (ఏప్రిల్ 13)కి నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ క్లబ్ గా చెప్పుకుంటున్న ఒక క్లబ్ కు వైస్సార్సీపీ వర్గాలు ఫుల్ స‌పోర్ట్ గా నిలిచాయి. ఏది ఏమైనా వైజాగ్ లోనే ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ బలోపేతం చేస్తారన్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఆ మేర‌కు ఏపీ ఫిలింఛాంబ‌ర్ అలానే ఎఫ్ డీసీలోనూ చ‌ర్చ సాగుతోంది. ఇక ప‌రిశ్ర‌మ పెద్ద‌లు మెగాస్టార్ చిరంజీవి.. అక్కినేని నాగార్జ‌న స‌హా ప‌లువురు ఫిలింస్టూడియోల కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకున్నార‌ని కూడా ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది.
Tags:    

Similar News