చిత్రపురి 10 ఎక‌రాల్లో TMTAUకి ఇండ్లు?

Update: 2020-03-07 02:30 GMT
హైద‌రాబాద్ నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ ఎటూ త‌ర‌లి వెళ్లిపోకుండా తెలంగాణ ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో మెజారిటీ పార్ట్ ఏపీకి చెందిన బ‌డా పారిశ్రామిక వేత్త‌లు.. వివిధ రంగాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ స్థిర‌ప‌డిన వాళ్లే సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే. వీళ్లంతా ఏపీకి ప‌లాయ‌నం చిత్త‌గిస్తే ఆ మేర‌కు తెలంగాణ రాష్ట్రానికి `క‌ళ` త‌ప్పుతుంద‌న్న ఆందోళ‌న ప్ర‌భుత్వంలో ఉండ‌నే ఉంది. అలాగే వినోద ప‌రిశ్ర‌మ నుంచి ఏటేటా వ‌సూల‌వుతున్న వంద‌ల కోట్ల జీఎస్టీ- ట్యాక్స్ రాబ‌డి త‌గ్గి పోతుంద‌న్న ఆందోళ‌నా ఉంది. అందుకే వీలున్నంత వ‌ర‌కూ ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు ఎవ‌రూ హైద‌రాబాద్ నుంచి ఏపీకి పోకుండా ఆపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తూనే ఉంది.

అందులో భాగంగానే మొన్న‌టికి మొన్న హ‌డావుడిగా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ తో సందడి చేయించారు కేసీఆర్ ప్ర‌భృతులు. అస‌లు సినిమా ప‌రిశ్ర‌మ‌కు చేసేదేమీ లేక‌పోయినా.. ఎటూ పోకుండా ఆపేందుకు ప్ర‌య‌త్న‌మేనా? ఇది అన్న చ‌ర్చా సాగింది. విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌క‌టించిన హామీల‌ ప్ర‌కారం.. తెలంగాణ‌ను ఫిలిం హ‌బ్ గా మార్చేస్తామ‌న్న కేసీఆర్ ప‌దేళ్లు అయినా ఇంకా ఏదీ చేయ‌క‌పోవ‌డంపై స్థానికంగానే బోలెడ‌న్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. తెలంగాణ ట్యాలెంట్ కోసం పూణే త‌ర‌హా ఇనిస్టిట్యూట్ తెస్తామ‌ని .. అలాగే యానిమేష‌న్ హబ్ గా గ‌చ్చిబౌళిని తీర్చిదిద్దుతామ‌ని ఇంత‌కు ముందు మంత్రి పొజిష‌న్ లో ఉన్న కేటీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కానీ ఏడెనిమిదేళ్ల పాల‌న‌లో ఏదీ చేయ‌లేదు. నాయ‌కుల‌ ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం... ప‌నులు శూన్యం! అన్న చందంగానే సినీఇండ‌స్ట్రీ ప‌రిస్థితి అయిపోయింద‌న్న అస‌హ‌నం ఇటీవ‌ల పెల్లుబికుతోంది. ఆ క్ర‌మంలోనే హ‌డావుడిగా త‌ల‌సాని సినీపెద్ద‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ఆ మూడింటిని హుఠాహుటీన ప్ర‌క‌టించేశారు.

మొన్నటికి మొన్న‌ చిరంజీవి ఇత‌ర సినీపెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగిన త‌ల‌సాని మీటింగులో కొన్ని కీల‌క నిర్ణ‌యాల్ని వెల్ల‌డించారు. పూణే ఫిలింఇనిస్టిట్యూట్ త‌ర‌హా ఇనిస్టిట్యూట్ ని ఏర్పాటు చేసేందుకు శంషాబాద్ ప‌రిస‌రాల్లో స్థ‌లం వెత‌కాల‌ని తీర్మానించారు. అలాగే గ‌చ్చిబౌళి లాంటి ప్రైమ్ ఏరియాలో ఉన్న‌ చిత్ర‌పురి కాల‌నీని ఆనుకుని 10 ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లాన్ని 24 శాఖ‌ల సినీ కార్మికుల ఇండ్ల కోసం కేటాయిస్తామ‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం ప్రామిస్ చేసింద‌ని త‌ల‌సాని తెలిపారు.

ఇక ఇప్ప‌టికే నిర్మించిన చిత్ర‌పురి కాల‌నీతో సంబంధం లేకుండా ఈ కొత్త వెంచ‌ర్ లో ఇండ్లు లేని కార్మికుల‌కు అపార్ట్ మెంట్లు క‌ట్టి ఇవ్వ‌నున్నారా? ఆ ప్రాజెక్ టును ఎవ‌రు చేప‌డ‌తారు? అందులో ఇండ్లు ఎవ‌రికి ఇస్తారు? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ద‌శాబ్ధం పైగా హిస్ట‌రీ ఉన్న చిత్ర‌పురి కాల‌నీలో త‌మ‌కు కూడా ఇండ్లు ఇవ్వాల‌ని ప‌లు అసోసియేష‌న్ల కార్మికులు గ‌గ్గోలు పెడుతున్నాయి. ఇక ఇందులో కాస్త మిడ్ రేంజ్ ఆర్టిస్టులు ఉండే తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు) ఇటీవ‌ల ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. దాదాపు 800 మంది ఆర్టిస్టుల‌తో అతి పెద్ద సంఘంగా అవ‌త‌రించిన ఈ సంఘం అల్ట్రా రిచ్ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) కే పోటీగా త‌యారైంది. అయితే టీఎంటీఏయు లో అంతా జూనియ‌ర్ ఆర్టిస్టులు.. చిన్నా చిత‌కా ఆర్టిస్టులే కాబ‌ట్టి ప్ర‌స్తుతం వీళ్లంతా త‌మ‌కు ఇండ్లు కేటాయించాల్సిందిగా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే యూనియ‌న్ అధ్య‌క్షుడు 30 ఇయ‌ర్స్ పృథ్వీరాజ్ త‌మ అసోసియేష‌న్ ఆఫీస్ కి సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సానిని ఆహ్వానించి స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాల‌ని కోరారు. అలాగే అర్హులంద‌రికీ చిత్ర‌పురి ప‌రిసరాల్లో త‌ల‌పెట్ట‌నున్న 10 ఎక‌రాల్లో నివాస యోగ్య‌మైన‌ అపార్ట్ మెంట్లు అయినా ఇవ్వ‌ల‌న్న ప్ర‌తిపాద‌న తెచ్చార‌ట‌. మ‌రి ఈ యాక్టివ్ గ్రూప్ పేద‌ ఆర్టిస్టుల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం చిత్తశుద్ధితో అపార్ట్ మెంట్లు క‌ట్టి ఇస్తుందా? లేక ఔట్ స్క‌ర్ట్స్ లో ఇండ్ల స్థ‌లాల్ని కేటాయిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి. అలాగే జ‌ర్న‌లిస్టుల‌కు చెందిన ఫిలింన‌గ‌ర్ హౌసింగ్ సొసైటీ త్వ‌ర‌లో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎంతో ప్రాచీన హిస్ట‌రీ ఉన్న ఈ సొసైటీలో సీనియ‌ర్ జ‌ర్నలిస్టుల‌కు కూడా ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి ఇండ్ల స్థ‌లాల్ని కేటాయించ‌క‌పోవ‌డంపై అసంతృప్తి నెల‌కొంది. మ‌రి వీట‌న్నిటినీ త‌ల‌సాని- కేసీఆర్ బృందం క్లియ‌ర్ చేస్తుందా? అన్న‌ది చూడాలి. ఎన్నిక‌ల వేళ హ‌డావుడి చేయ‌డం.. ఆ త‌ర్వాత సినిమా వాళ్ల‌ను లైట్ తీస్కోవ‌డం ప్ర‌తిసారీ మామూలుగానే మారింది. మ‌రి మునుముందు కీల‌కమైన ఎన్నిక‌ల‌కు స‌మ‌యం రానుంది. ఇలాంటి టైమ్ లో సినిమావాళ్ల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం గుర్తిస్తుందా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News