జాక్విలిన్‌కి జైలు ప్రేమికుడు 30కోట్ల హెలీకాఫ్టర్ గిఫ్ట్
అతడు ఒక జైలు పక్షి. అయినా గొప్ప ప్రేమికుడు. ప్రియురాలి కోసం ఆకాశానికి మెట్లు కడతాడు. చుక్కల్ని కోసి తెస్తాడు.;
అతడు ఒక జైలు పక్షి. అయినా గొప్ప ప్రేమికుడు. ప్రియురాలి కోసం ఆకాశానికి మెట్లు కడతాడు. చుక్కల్ని కోసి తెస్తాడు. చందమామను తెమ్మన్నా తేగలడు! ఇంతకీ ఎవరు అతడు? అంటే... కచ్ఛితంగా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ గురించే ఇదంతా. మ్యాట్రిక్స్ ప్రమోటర్స్ ని 200కోట్లకు ముంచిన కేసులో అతడు ప్రస్తుతం జైలులో ఖైదీగా ఉన్నాడు. అయినా జైలు నుంచి తన ప్రియురాలికి ప్రేమలేఖలు రాస్తూ నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్నాడు.
సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి తన ప్రియురాలిగా చెప్పుకుంటున్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ కి పంపిస్తున్న లేఖలు, ఇస్తున్న ఆఫర్లు ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్ద సెన్సేషన్‌గా మారాయి. ఇప్పుడు ఏకంగా 30కోట్ల విలువైన హెలీకాఫ్టర్ ని వేలెంటైన్స్ డే కానుకగా అందిస్తానని ప్రకటించాడు.
వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా సుకేశ్ రాసిన లేఖలో రూ.30 కోట్ల విలువైన హెలికాప్టర్ గురించి ప్రస్తావించాడు. దానికి JF (J-జాక్విలిన్ F-ఫెర్నాండెజ్) అని పేరు కూడా పెట్టానని.. దాని ఫోటోలను కూడా త్వరలో పంపిస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కేవలం హెలికాప్టర్ మాత్రమే కాదు.. గతంలో లగ్జరీ కార్లు, డైమండ్ రింగులు, ఖరీదైన బ్యాగులు కూడా ఇస్తానని ఆఫర్ చేశాడు. అంతేకాదు తమ కాపురం కోసం ఒక ఖరీదైన బంగ్లా విదేశాలలో సిద్ధంగా ఉందని కూడా చెప్పాడు.
అయితే జాక్విలిన్ ఈ కానుకలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే.. ఏమాత్రం సిద్ధంగా లేదు. వాస్తవానికి ఆమె సుకేశ్ నుంచి వస్తున్న ఈ వేధింపులను ఆపాలని కోర్టును ఆశ్రయించింది. సుకేశ్ జైలు నుంచి తనకు లేఖలు పంపకుండా తన పేరును ఎక్కడా ప్రస్తావించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది.
సుఖేష్ తో భవిష్యత్‌లో ఎలాంటి సంబంధం కోరుకోవడం లేదు సరే కదా... అతడి వల్ల తను ఎదుర్కొంటున్న ఈడీ (ఈడీ) విచారణల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తోంది.
ఇది నిజంగా గిఫ్టా? లేక మైండ్ గేమ్?
సుకేశ్ చంద్రశేఖర్ పైన వందల కోట్ల రూపాయల మోసానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. అతడు జైలులో ఉండి ఇలాంటి ఖరీదైన గిఫ్టుల గురించి మాట్లాడటం వెనుక రెండు కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. అతడు ఎక్కడ ఉన్నా ఇంకా వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. తన దగ్గర ఇంకా చాలా డబ్బు ఉందనే భ్రమను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు ప్రజలను తన మైండ్ గేమ్ లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈడీ అతడి ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
సుకేష్ నుంచి జాక్విలిన్, ఆమె కుటుంబం అందుకున్న కానుకలు ఇప్పుడు ఈ ముప్పునకు కారణం. అందుకే సుకేశ్ ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా.. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న ఆ గిఫ్టులను అందుకోవడం జాక్విలిన్‌కు మరింత ప్రమాదకరం. అందుకే కానుకలకు దూరంగా ఉండటమే కాకుండా, అతడిని దూరం పెట్టడానికి, అతడి ఆగడాలను అడ్డుకోవడానికి చట్టపరంగా పోరాడుతోంది.