కైకాల ఆరోగ్యంపైనే దృష్టి పెట్టిన చిరూ!

Update: 2021-11-25 03:46 GMT
తెలుగు తెరపై విలక్షణమైన విలనిజాన్ని పండించినవారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. పవర్ఫుల్ విలనిజంతో పాటు .. కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలను సైతం ఆయన పోషించారు. తండ్రి పాత్రల్లోను .. తాత పాత్రల్లోను మెప్పించారు. మొహమాటపడే సన్నివేశాల్లో .. ఏదో ఒక కారణంగా బెట్టు చేసే సన్నివేశాల్లో అంతలా జీవించడం మరొకరికి సాధ్యం కాదేమో. అప్పట్లో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ తమదైన ప్రత్యేకతతో దూసుకుపోతుంటే, మరొకరు ఆ స్థాయి పాత్రల గురించి ఆలోచన కూడా చేసేవారు కాదు.

అలాంటి పరిస్థితుల్లో కైకాల ఏకంగా ఎస్వీఆర్ స్థాయిలో నటించాలని అనుకోవడం .. ఆయనతోనే శభాష్ అనిపించుకోవడం విశేషం. ఎన్టీఆర్ సొంత సినిమాల్లో కైకాల ఉండవలసిందే. ఆయనకి కుదరకపోతే ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేద్దాం అనేవారట. అంతగా నటన పరంగా ఆయన ఎన్టీఆర్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎస్వీఆర్ లేని లోటును కైకాల భర్తీ చేస్తూ వచ్చారు. ఎస్వీఆర్ తరువాత ఆయన పోషించిన యముడు .. రావణుడు .. ఘటోత్కచుడు పాత్రలే అందుకు నిలువెత్తు నిదర్శనం. కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని కెరియర్ ను ఆయన కొనసాగించారు.

అలాంటి కైకాల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ మధ్య పరిశ్రమ తనని పట్టించుకోవడం లేదనే అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. ఆ తరువాత నుంచి చిరంజీవి ఆయనను తరచూ కలుస్తుండేవారు. ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. చిరంజీవి ఉండగా తనకి భయం లేదనే భరోసాను ఈ మధ్య కూడా ఆయన వ్యక్తం చేశారు. ఆ నమ్మకానికి తగినట్టుగానే, ఆయన అపోలో హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి చిరంజీవి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

కొన్ని రోజుల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కైకాల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెబుతున్నారు. ఆయన నిదానంగా కోలుకుంటున్నారని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆయన కోలుకోవడానికి వైద్యులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా కైకాల ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారట. ఎలాంటి సహాయ సహకారాలు కావలసి వచ్చినా తనని కాంటాక్ట్ చేయమని కైకాల కుమారుడితో చెప్పినట్టుగా తెలుస్తోంది. కైకాల అభిమానులంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Tags:    

Similar News