ఆ సినిమాతో నా జన్మ ధన్యమైంది : చిరంజీవి

Update: 2020-05-09 08:55 GMT
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచి పోయే చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. అద్బుతమైన ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా అశ్వినీదత్‌ నిర్మించారు. విజువల్‌ వండర్‌ గా రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లు అయ్యింది. చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్‌ గా తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇప్పటికి కూడా ఒక ఆణిముత్యంగా నిలిచింది. తెలుగు క్లాసిక్‌ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకు సంబంధించిన విశేషాలు ప్రత్యేకంగా షేర్‌ చేసుకున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ... జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్బంగా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా ఆల్‌ టైం హిట్‌ చిత్రాల్లో టాప్‌ 25 చిత్రాల్లో ఇది ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక టైం లెస్‌ సినిమా. ఇప్పుడు... అప్పుడు అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఏ తరం ప్రేక్షకులకు అయినా కూడా నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఎవర్‌ క్లాసిక్‌ సినిమా ఇది. ఇలాంటి సినిమాలో నాకు నటించే అవకాశం రావడం నా నట జీవితంలో గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను.  అలాంటి సినిమాలో నటించినందుకు నా జన్మ ధన్యమైంది.

దర్శకుడు రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. దీన్ని అద్బుతంగా తెరకెక్కించారు. ఒక శిల్పి మాదిరిగా ఒక దీక్షతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంకు ఆయన అంతగా కష్టపడటానికి కారణం ఒకటి ఉంది. ఈ సినిమాకు ముందు ఆయన కాస్త డల్‌ అయ్యారు. కొన్ని ఫెయిల్యూర్స్‌ చూశారు. అందుకే ఈ సినిమాతో తన సత్తా నిరూపించుకునే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథ విన్న వారు ఇప్పుడు చందమామ కథ ఎవరు చూస్తారు అన్న వారికి చెంపపెట్టులా అద్బుతంగా చిత్రీకరించారు. ఇలాంటి సినిమాను మా అందరికి ఇచ్చినందుకు రాఘవేంద్ర రావుగారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు అనిపిస్తుంది. ఆ పాత్ర సినిమా కేవలం శ్రీదేవి కోసమే తయారు అయ్యాయా అనిపిస్తుంది. శ్రీదేవి తప్ప దేవకన్యగా మరెవ్వరు ఎవరిని ఊహించుకోలేం. ఆమె అమాయకపు చూపులు.. ఆమె మాటలతో పాత్రకు జీవం పోశారు. ఆమెతో నటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆమెతో నేను నటించింది అదే మొదటి సారి. ఆమెతో నటించేందుకు నేను మొదటి సారి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆమె అంద చందాలు చూస్తూ కొన్ని సార్లు నటించేందుకు కష్టపడాల్సి వచ్చింది.

నిర్మాత అశ్వినీదత్‌ గురించి మాట్లాడుతూ... నా జెనరేషన్‌లో ఒక గొప్ప నిర్మాత అశ్వినీదత్‌. ఆయన ఖర్చుకు వెనకాడడు. సినిమాకు ఎన్ని డబ్బులు వచ్చినవి కాకుండా ఎంత పేరు వచ్చింది అనేది చూస్తాడు. ఆ విషయంలో మాత్రం అశ్వినీదత్‌ తో ఎవరు పోటీ పడలేరు. రాజీ పడని భారీ నిర్మాత ఆయన. ఆయన నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడంతో నేను ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాను.

ఇక వేటూరి, కీరవాణిలు కూడా సినిమాకు ప్రాణం పోశారు. వారి పాటలు తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోతాయి. అబ్బానీ తీయనీ దెబ్బ పాటను కేవలం కొన్ని గంటల్లోనే ట్యూన్‌ చేసి, రాసి, రికార్డ్‌ చేసి ఇచ్చారు. అంత గొప్ప సాంగ్‌ను అంత తక్కువ సమయంలో ఇవ్వడం నిజంగా అద్బుతం అన్నారు.

ఇలాంటి సినిమాను చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అన్నాడు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి చిరంజీవి అభినందనలు తెలియజేశాడు.

Full View

Tags:    

Similar News