పవన్, చరణ్ సినిమాలు.. తెలంగాణలో ఏం జరగనుంది?
2026 సమ్మర్ సీజన్ దగ్గరపడుతుండటంతో టాలీవుడ్ లో భారీ సినిమాల రిలీజ్ పై అందరి దృష్టి నెలకొంది.;
2026 సమ్మర్ సీజన్ దగ్గరపడుతుండటంతో టాలీవుడ్ లో భారీ సినిమాల రిలీజ్ పై అందరి దృష్టి నెలకొంది. పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతుండటంతో నిర్మాతలు భారీ వసూళ్లపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి కలెక్షన్ల సంగతి కంటే ముందే టికెట్ ధరల పెంపు అంశం ప్రొడ్యూసర్లకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి.
ఎందుకంటే ధరల విషయంపై రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు పలు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ సినిమా టికెట్ ధరలు పెంచాలన్నా విడుదలకు 90 రోజుల ముందు అనుమతి కోసం దరఖాస్తు చేయాలని కోర్టు పేర్కొంది. చివరి నిమిషంలో పెంపు కోరితే పరిగణనలోకి తీసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతో ఆ ఆదేశాలు నిర్మాతల్లో ఆందోళన కలిగించాయి.
ఇది సాధారణ చిన్న సినిమాలకు పెద్ద సమస్య కాకపోయినా, భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రం కష్టంగా మారింది. ఎందుకంటే పెద్ద సినిమాల విడుదల తేదీలు చాలా సార్లు షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేదా పోటీ కారణాలతో మారుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మూడు నెలల ముందే అప్లై చేయడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని నిర్మాతలు అంటున్నారు.
ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో భారీ ఖర్చులతో తెరకెక్కిన సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. థియేటర్ రెంట్లు, ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో టికెట్ ధరల పెంపు నిర్మాతలకు కీలక రెవెన్యూ సోర్స్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అది లేకపోతే పెట్టుబడులు రికవరీ కావడం కష్టమని నిర్మాతలు చెబుతున్నారు. అందుకే ధరల పెంపు అవసరమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు సమావేశమై రీసెంట్ గా ఆ సమస్యపై చర్చించారట. ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలవాలని ప్లాన్ చేస్తున్నారు. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఒక స్టాండర్డ్ విధానం తీసుకురావాలని, పెద్ద సినిమాలకు ఒకే రకమైన టికెట్ పెంపు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం.
కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో సమ్మర్ లో విడుదలకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది వంటి భారీ చిత్రాల నిర్మాతలు ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అనుమతులు ఆలస్యమైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి సమ్మర్ సీజన్ అంటే బాక్సాఫీస్ పండగే. కానీ టికెట్ ధరల పెంపుపై సరైన రూల్స్ లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం త్వరగా స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటే నిర్మాతలకు ఊరట లభించే పరిస్థితి కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.