'ది కేరళ స్టోరీ 2' కు కేరళ హైకోర్టు షాక్!
ఈ సందర్భంగా టీజర్‌ని కూడా సెన్సార్ లేకుండా రిలీజ్ చేశారని పిటీషనర్ వాదించడంతో టీజర్‌ని వెనక్కి తీసుకుంటామని మేకర్స్ కేరళ హైకోర్టుకు స్పష్టం చేశారు.;
ఆదాశర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ రూపొందించిన క్రైమ్ డ్రామా 'ది కేరళ స్టోరీ'. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. 2023లో విడుదలైన ఈ సినిమా అనేక వివాదాలకు తెరలేపింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. దాదాపు రెండేళ్ల విరామం తరువాత దీనికి సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2'ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ రూపొందించారు. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
టీజర్ రిలీజ్ తరువాత వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడంతో మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా సినిమా ఉందని కేరళ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా కేరళ ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా ఉందని, కేరళని తప్పుగా చూపించారని పేర్కొంది. కేరళలో ప్రజలందరూ సామరస్యంతో జీవిస్తున్నారని, అయితే ఈ సినిమా కేరళను తప్పుగా చూపించేలా ఉందని అభిప్రాయ పడింది.
ఈ సినిమాలోని కొన్ని డైలాగులని పరిశీలించిన న్యాయమూర్తి కేరళ పేరుని టైటిల్‌లో ఉపయోగించడం ద్వారా రాష్ట్రంపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, ఇది మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు కోర్టులో ఫిబ్రవరి 25న సినిమాని ప్రదర్శించాలని, ఆ తరువాతే సెన్సార్ విషయంలో నిర్ణయం తీసుకోగలమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీజర్‌ని కూడా సెన్సార్ లేకుండా రిలీజ్ చేశారని పిటీషనర్ వాదించడంతో టీజర్‌ని వెనక్కి తీసుకుంటామని మేకర్స్ కేరళ హైకోర్టుకు స్పష్టం చేశారు. అంతే కాకుండా కోర్టు ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించామని చెబుతున్నందున కేరళ ప్రజల భాయాందోళనలను విస్మరించలేమని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. సినిమా టైటిల్‌లో కేరళ పేరు ఉన్నప్పటికీ చిత్రంలో ఇతర రాష్ట్రాల కథలు కూడా ఉన్నాయని, ఇది ఒక ప్రాంతాన్ని కించపరిచేదిలా ఉందని పిటీషనర్ వాదించారు.
గతంలో 'ఘూస్ ఖోర్ పండిట్' వంటి సినిమా కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పిటీషనర్ గుర్తు చేస్తూ టైటిల్ ఒక వర్గాన్ని, ప్రాంతాన్ని కించపరిచేవిగా ఉండకూడదన్నారు. ఒకవేళ అలా ఉంటే టైటిల్‌తో పాటు సినిమా విడుదలను నిలిపివేయాల్సిందిగా పిటీషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే మేకర్స్ మాత్రం మా వద్ద సెన్సార్ సర్టిఫికెట్ ఉందని వాదించినప్పటికీ చట్టపరమైన నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన దృశ్యాలు లేదా మాటలు ఉండకూడదని కోర్టు పేర్కొంది. సినిమాని చూసిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో 'ది కేరళ స్టోరీ 2' ఫిబ్రవరి 27న విడుదలవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.