షాక్ తిన్నది మెగా ఫ్యాన్స్ కాదట.. డైరెక్టర్లట!

Update: 2020-04-24 04:45 GMT
మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ సుజిత్.. బాబీ.. మెహర్ రమేష్ పేర్లు చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాల కోసం లైన్లో పెట్టిన డైరెక్టర్ల పేర్లు వినగానే చాలామందికి మెగా షాక్ తగిలింది.  మెగా ఫ్యాన్స్ అయితే దాదాపుగా బెంబేలెత్తిపోయారు.  

సుజిత్ టాలెంటెడ్ డైరెక్టరే కానీ 'సాహో' తో బెదరగొట్టాడు. పెద్ద స్టార్ హీరోలను డీల్ చేసే అనుభవం ఇంకా రాలేదని చాలామంది అభిప్రాయం. బాబీ కొంత పర్వాలేదు.. గొప్ప సినిమాలు కాకపోయినా ఏదో కాలం కలిసి వస్తే  హిట్ అనిపించుకునే సినిమాలనే తెరకెక్కించాడు. మసాలా మార్గం తూచ తప్పకుండా అనుసరించడం.. కొత్తదనం లేకుండా వీలైనంత జాగ్రత్త పడడం ఈ డైరెక్టర్ ప్రత్యేకత. అయితే చిరు ఇమేజ్ ను డీల్ చెయ్యగలడా లేదా అనేది అనుమానమే. ఇక మెహర్ రమేష్ గరించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.  

నిజానికి మెగాస్టార్ - కొరటాల శివ కాంబో చాలా క్రేజీ. అభిమానులు కూడా చాలా హ్యాపీ.  ఇలాగే సుకుమార్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. పూరి జగన్నాధ్.. హరీష్ శంకర్.. లాంటివారితో చిరు సినిమా చేస్తారంటే మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు.  హిట్స్..ఫ్లాప్ పక్కన పెడితే వారికి స్టార్ హీరోలను డీల్ చేసే సత్తా.. బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించే సత్తా ఉందని చాలామంది నమ్ముతారు. వీరు కాకపోతే సందీప్ వంగా.. నాగ్ అశ్విన్  లాంటి కొత్త తరం దర్శకులు ఎలాగూ ఉన్నారు.  వీరందరిని కాదని మెగాస్టార్ అలాంటి మూస దర్శకులను ఎందుకు ఎంచుకున్నారోనని మెగాఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట.

అయితే మెగా ఫ్యాన్స్ కంటే కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యువ దర్శకులు.. సీనియర్  దర్శకులు చిరు చెప్పిన పేర్లతో ఖంగుతిన్నారని లేటుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ తో సినిమా చేయాలనేది చాలామంది దర్శకులకు ఒక కల. పూరి లాంటి సీనియర్ దర్శకుడే అయితే ఆ విషయం చాలా సార్లు ఓపెన్ గా చెప్పారు. అలాంటిది మెగాస్టార్ ఎలా ఆ దర్శకులను ఎంచుకున్నారో అర్థం కావడం లేదట.  బాబీ.. మెహర్ ఇద్దరూ స్టోరీ ఎలా ఉన్నప్పటికీ స్టోరీ నేరేషన్ తో హీరోలను మెప్పించడంలో దిట్టలు అని.. అందుకే ఇలా జరిగి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News