హైదరాబాది మ్యూజిక్ లవర్స్ ఇలా ఉన్నారేంట్రా బాబు!
రెండు మూడు పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకానికి ప్రేక్షకులు వస్తారు.;
తెలుగు సినిమాల్లో మ్యూజిక్ ఎంతటి ప్రధాన పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు మూడు పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకానికి ప్రేక్షకులు వస్తారు. సినిమాకు పాటలతో హైప్ రావడం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ మేరకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతకు మించి అన్నట్లుగా ప్రతి సినిమాలోనూ వైవిధ్యభరిత పాటలు ఇస్తున్నారు, అందుకు తగ్గట్లుగానే వారు భారీ పారితోషికంను అందుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌లు ఈ మధ్య కాలంలో భారీ పారితోషికాలు అందుకోవడం మాత్రమే కాకుండా లైవ్ కన్సర్ట్ పేరుతో భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. గతంలో సింగర్స్ మాత్రమే లైవ్ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ లైవ్ లో సందడి చేస్తున్నారు.
అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్...
విదేశాల్లో ఎక్కువగా లైవ్ కాన్సర్ట్ లు జరగడం మనం చూస్తూ ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా పెద్ద ఎత్తున లైవ్ కాన్సర్ట్ లు జరుగుతూ ఉన్నాయి. మెట్రో నగరాల్లో ప్రముఖ సంగీత దర్శకులు, లెజెండ్రీ సింగర్స్ లైవ్ కాన్సర్ట్ లు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయంను అంది పుచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో మార్చి 21న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్ ను నిర్వహించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ వారు ఈ కార్యక్రమంను నిర్వహించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. సాదారణంగా ఈవెంట్ సంస్థలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తాయి. కానీ సితార ద్వారా నాగవంశీ ఈ లైవ్ కాన్సర్ట్ ను నిర్వహించడం అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లో అనిరుధ్ రవిచంద్రన్...
నెల రోజుల ముందుగానే ఈ లైవ్ కాన్సర్ట్ యొక్క పాస్‌లను ఆన్ లైన్‌లో పెట్టడం జరిగింది. అనిరుధ్‌కి ఉన్న డిమాండ్, ఆయన క్రేజ్, ఆయన ఇవ్వబోతున్న పెర్‌ఫర్మెన్స్ నేపథ్యంలో భారీ మొత్తంలో పాస్‌లకు రేట్లు నిర్ణయించారు. బాబోయ్ ఇంత రేటు అవసరమా అనుకుంటారేమో అని కొందరు భావించారు. కానీ అనిరుధ్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో దాదాపుగా పది వేల పాస్‌లు కేవలం ఒక్క రోజులోనే అమ్ముడు పోయాయి. సినిమాలు అంటే ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు పాటలను ఎంతగా ప్రేమిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అనిరుధ్ కి ఈ మధ్య కాలంలో దక్కిన క్రేజ్ కి ఇది ప్రత్యక్ష నిదర్శణం అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వేలాది రూపాయలు ఉన్న పాస్ లను కొన్ని గంటల వ్యవధిలోనే బుక్ చేసుకోవడంను బట్టి చూస్తూ ఉంటే తెలుగు ప్రేక్షకుల్లో అనిరుధ్ అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పాస్‌ల బుకింగ్ చూసి బాబోయ్ హైదరాబాదీ మ్యూజిక్ లవర్స్ ఇలా ఉన్నారేంట్రా బాబోయ్ అనే టాక్ వచ్చింది.
విక్రమ్, జైలర్ ల మ్యూజిక్‌తో...
అనిరుధ్ తెలుగులో ఈ మద్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈయన సంగీత సారధ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దేవర, దసరా, గ్యాంగ్‌లీడర్, జెర్సీ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. విక్రమ్, జైలర్ సినిమాలకు ఈయన అందించిన సంగీతం పాన్ ఇండియా రేంజ్‌లో ఆ సినిమాలను నిలిపిన విషయం తెల్సిందే. అందుకే మార్చి లో నిర్వహించబోతున్న ఈ వీకెండ్ మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ కి మంచి డిమాండ్ పెరిగింది. అనౌన్స్‌మెంట్ నుంచే పాస్ లను దక్కించుకునేందుకు చాలా మంది వేచి చూశారు. ఎట్టకేలకు బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసుకున్నారు. సితార వారికి ఈ కార్యక్రమం ద్వారా భారీ మొత్తంలో లాభం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. అనిరుధ్ ఈ మ్యూజిక్ కాన్సర్ట్ తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలను కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.