ఫారిన్ డాన్సర్స్ తో చరణ్ .. కియారా ఆటాపాట!

Update: 2021-11-25 11:30 GMT
చరణ్ - శంకర్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రూపొందుతోంది. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆయన బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. అందువలన ఈ ప్రాజెక్టు తన బ్యానర్ స్థాయిని పెంచేలా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఫస్టు షెడ్యూల్ షూటింగును పూణేలో చేశారు. ఆ షెడ్యూల్ అంతా కూడా అక్కడ ట్రైన్ నేపథ్యంలో నడిచే యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు.

ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాదు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో చరణ్ - కియారా కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తో పాటు ఒక పాటను కూడా ప్లాన్ చేశారు. చరణ్ - కియారాతో పాటు, అమెరికా .. రష్యా .. ఉక్రెయిన్ .. బ్రెజిల్ .. ఆఫ్రికా .. యూరప్ తదితర దేశాలకు చెందిన 80 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొననున్నారు. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించనున్నారట. తమన్ స్వరపరిచిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు.

సహజంగానే శంకర్ సినిమాల్లో భారీతనం కనిపిస్తూ ఉంటుంది. పాటల్లోను ఆయన ఆ భారీతనాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఎంతమంది డాన్సర్లు ఉన్నప్పటికీ డాన్స్ విషయంలో ఎక్కడా గందరగోళం అనిపించదు. పాట అందంగా .. ఆకర్షణీయంగా సాగిపోయేలానే ఆయన చూసుకుంటారు. పాట పరమైన ప్రత్యేకతను పాటకి ఇవ్వడం కోసం ఆయన వివిధ దేశాల్లో చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. 'జీన్స్' సినిమాలోని ఒక పాట కోసం ఆయన ప్రపంచ వింతలను కవర్ చేశాడు. సినిమాలో ఆ పాట హైలైట్ గా నిలిచింది.

అప్పటివరకూ అంత ఖర్చుతో కూడుకున్న ఒక ప్రయోగానికి ఎవరూ పూనుకోలేదు. అలాగే చరణ్ సినిమాలోని ఈ పాటను గురించి అందరూ మాట్లాడుకునేలా ఆయన చిత్రీకరించనున్నారు. అందుకోసమే వివిధ దేశాల నుంచి డాన్సర్స్ ను పిలిపించారు. 80 మంది విదేశీయలతో తెరపై ఏ స్థాయి సందడి చేయనున్నారనేది చూడాలి. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా. శంకర్ కాంబినేషన్లో ఆయన ఎలాంటి సంచలనానికి తెరతీస్తాడో చూడాలి.
Tags:    

Similar News