అలా చెబితే ఎవరూ వేషం ఇవ్వరు

Update: 2021-12-08 02:30 GMT
బ్రహ్మానందం .. తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం. తన గురువు జంధ్యాలగారని చెప్పుకునే బ్రహ్మానందం ఇంతవరకూ 1200లకి పైగా సినిమాలు చేశారు.

ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ఆయన మెప్పించారు. కొన్ని దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్నారు. హీరో .. హీరోయిన్ ఎవరైనా బ్రహ్మానందం ఉంటే చాలు అన్నట్టుగా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారు. అంతటి ప్రభావం చూపిన బ్రహ్మానందం తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం (రెండవ భాగం)లో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

"బ్రహ్మానందం ఇంతకుముందు కనిపించినట్టుగా తెరపై ఇప్పుడు కనిపించడం లేదు అంటున్నారు. ఎందుకులే అని వాళ్లు అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకులే అని నేను కూడా అనుకుని ఉండొచ్చు. రెండేళ్లుగా కరోనా ప్రభావం ఉంది.

అంతకుముందు నాకు బైపాస్ సర్జరీ జరిగింది. అన్నీ సర్దుకుని బయటికి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఓ ఐదారు సినిమాలు చేస్తున్నాను. 'భీమ్లా నాయక్' .. 'రంగమార్తాండ'తో పాటు శర్వానంద్ .. నితిన్ సినిమాలు కూడా చేస్తున్నాను. ఇంతవరకూ ఎన్నో కష్టాలుపడుతూ వచ్చాను. ఇకనైనా కాస్త సుఖపడాలనుకుంటున్నాను.

అలీ .. నీ వయసులో ఉన్నప్పుడు మేము ఎంతో కష్టపడ్డాము. టైమ్ .. పని అందరికీ దొరకదు. నువ్వు .. నేను మాత్రమే గొప్పవాళ్లం కాదు .. మనకంటే గొప్పవాళ్లు చాలామంది ఉన్నారు .. కృష్ణా నగర్లో .. గణపతి కాంప్లెక్స్ లో. వాళ్లందరికీ అవకాశాలు రాలేదు .. పనులు దొరకలేదు. పని దొరకలేదని చాలామంది ఫీలవుతున్నారు. అలాంటప్పుడు పని దొరికినప్పుడు దానిని గౌరవించి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకే నా వయసు వచ్చేవరకూ కష్టపడమని నీకూ చెబుతూ ఉంటాను. నువ్వు వింటావు అనే నమ్మకం నాకు ఉంది గనుక చెప్పాను.

బ్రహ్మానందం చేసే పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయనే విమర్శ నా వరకూ వచ్చింది. నేను సినిమా తీయడం లేదు .. డైరెక్ట్ చేయడం లేదు . కేరక్టర్స్ క్రియేట్ చేయడం లేదు.

ఈ మూడు పనులు ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ కి బ్రహ్మానందం అయితే బాగుంటాడని దర్శక నిర్మాతలు అనుకుంటారు .. రైటర్ చేత రాయిస్తారు. "నేను ఈ పాత్రను చేయను సార్ .. ఎందువల్లనంటే ఇంతకుముందే నేను ఇలాంటి పాత్రను చేశాను" అని చెబుతూ కూర్చుంటే ఒక్క క్యారెక్టర్ కూడా ఉండదు .. ఎవరూ వేషం ఇవ్వరు. మన దగ్గర నుంచి అవతలివారికి ఏం కావాలో అది ఇవ్వడమే ఆర్టిస్టుకు ఉండవలసిన మొదటి లక్షణం" అని చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News