పాక్ క్రికెట్‌లో విధు వినోద్ చోప్రా కుమారుడు.. ఫేక్ అంటూ కొట్టి పారేసాడు!

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 వేలంలో అతడు తన పేరును నమోదు చేసుకున్నాడన్న వార్తలతో అగ్నిదేవ్ పేరు వివాదంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-02-08 22:30 GMT

ప్ర‌ముఖ ద‌ర్శ‌క ర‌చ‌యిత, `ట్వ‌ల్త్ ఫెయిల్` ద‌ర్శ‌కుడు విధు వినోద్ చోప్రా - జ‌ర్న‌లిస్ట్ కం ఫిలింక్రిటిక్ అనుపమ చోప్రాల కుమారుడు అగ్నిదేవ్ చోప్రా గురించి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ న‌డుస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 వేలంలో అతడు తన పేరును నమోదు చేసుకున్నాడన్న వార్తలతో అగ్నిదేవ్ పేరు వివాదంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పిఎస్ఎల్ 11వ ఎడిషన్ వేలం జాబితాలో అగ్నిదేవ్ పేరు `USA సిటిజన్` కేటగిరీలో ఉంద‌ని, సుమారు 6,00,000 పాకిస్థానీ రూపాయిల బేస్ ధ‌ర‌తో కనిపించిందని కొన్ని స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్త‌ల‌ను అత‌డు స్వయంగా ఖండించారు.

దీనిపై అగ్నిదేవ్ స్పందిస్తూ..నా పేరు మీద జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం.. తప్పుదోవ పట్టించేది. నేను పిఎస్ఎల్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. నా దృష్టంతా అమెరికాలో నా క్రికెట్ ప్రయాణం.. నా దీర్ఘకాలిక లక్ష్యాలపైనే ఉందని స్పష్టం చేశారు. అగ్నిదేవ్ డెట్రాయిట్ లో జన్మించడం వల్ల అతడికి అమెరికన్ పాస్‌పోర్ట్ ఉంది. దీనివల్ల ఎవరో కావాలనే అతడిని `ఓవర్సీస్ అసోసియేట్ ప్లేయర్`గా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేశారని తెలుస్తోంది.

అగ్నిదేవ్ పేరు తెరపైకి రాగానే, నెటిజనులు అత‌డి తల్లి, ప్రముఖ సినీ విమర్శకురాలు అనుపమ చోప్రాను లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శిస్తున్నారు. ఇటీవల `ధురంధర్` చిత్రానికి అనుప‌మ ఇచ్చిన రివ్యూ తీవ్ర వివాదాస్పదమైంది. అనుప‌మ‌ విమర్శలు దేశ వ్య‌తిరేక‌త‌తో నిండి ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రివ్యూను తొలగించేలా ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో కుమారుడు పాకిస్థాన్ లీగ్‌లో ఆడుతున్నాడన్న వార్త రావడంతో, ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. అయితే అగ్నిదేవ్ క్లారిటీతో ఈ వివాదానికి తెరపడింది.

అగ్నిదేవ్ చోప్రా కేవలం సెల‌బ్రిటీ కిడ్ మాత్రమే కాదు.. అద్భుతమైన క్రికెటర్ కూడా.. రంజీ ట్రోఫీలో మిజోరం తరపున ఆడుతూ, తన మొదటి నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనే సెంచరీలు బాది చరిత్ర సృష్టించారు. అత్యధిక పరుగులు చేసినందుకు గానూ బీసీసీఐ నుండి మాధవరావు సింధియా అవార్డు కూడా అందుకున్నారు.

అమెరికాలో కింగ్ అత‌డు..

అగ్నిదేవ్ ప్రస్తుతం తన క్రికెట్ ప్రయాణాన్ని అమెరికాలో కొన‌సాగిస్తున్నారు. అగ్నిదేవ్ గతంలో ఎం.ఐ న్యూయార్క్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జూలై 2026లో జరగబోయే ఎం.ఎల్‌.సి తదుపరి సీజన్‌లో మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. అగ్నిదేవ్ అమెరికన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నందున, యుఎస్ఏ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడాల్సి ఉంది.

భారత దేశవాళీ క్రికెట్‌లో అగ్నిదేవ్ సృష్టించిన రికార్డులు అసాధారణమైనవి. తన మొదటి నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలోనూ సెంచరీలు బాదిన మొదటి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు. 2024-25 సీజన్‌లో మిజోరం తరపున కేవలం 11 మ్యాచ్‌ల్లోనే 1,800 పైగా పరుగులు చేశారు. ఆయన సగటు దాదాపు 95.0 గా ఉండటం విశేషం. అగ్నిదేవ్ తన తదుపరి లక్ష్యంగా అమెరికా క్రికెట్ బోర్డు ఒప్పందాలను, అక్కడ జరిగే స్థానిక లీగ్‌లను ఎంచుకున్నారు.

Tags:    

Similar News