ఇమాన్వి క్రేజ్.. తొలి సినిమా విడుదల కాకముందే మరో బిగ్ ప్రాజెక్టులో ఛాన్స్!
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశం మొదట చిన్న సినిమాలలోనే లభిస్తుంది.;
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశం మొదట చిన్న సినిమాలలోనే లభిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రం స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు లభిస్తాయి. కానీ ఇక్కడ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కి సెలబ్రిటీలతో పెద్దగా టచ్ లేకపోయినా ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తొలిసినిమా చేసే అవకాశం లభించడంతో యావత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అసలు ఆమెను ఎవరు? ఎందుకు ఆమెను ఎంపిక చేసుకున్నారు? ఆమెలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తం చేశారు.
హీరోయిన్స్ ఎంపిక విషయంలో హను ప్రత్యేక శ్రద్ధ..
వాస్తవానికి హీరోయిన్స్ ని ఎంపిక చేసుకునే విషయంలో డైరెక్టర్ హను రాఘవపూడి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన హీరోయిన్స్ ను ఎంపిక చేసుకునే విధానం కూడా అందరిని ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే ఆయన ఇదివరకే సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసుకొని ఆమెకు ఊహించని పాపులారిటీ అందించారు. ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. పైగా ఆ పాత్రకు మృణాల్ తప్ప మరొకరు నటించలేరు అనే అభిప్రాయానికి వచ్చారు. అలాంటి ఈయన ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడంతోనే మొదట్లో అనుమానాలు వ్యక్తమైనా.. ఈమె ఇంస్టా ప్రొఫైల్ చూసిన తరువాతే అందరూ నిర్ధారణకు వచ్చేశారు..
మరో బడా ప్రాజెక్టులో అవకాశం..
దీనికి తోడు ఆమె ముఖ కవళికలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పైగా ఈమె గొప్ప క్లాసికల్ డాన్సర్ కూడా. ఇక ఈమె థియేటర్ లో తెరపై చేయబోయే సందడి కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇదిలా ఉండగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం లభించడమే ఒక గొప్ప అవకాశం అయితే ఇంకా ఈ సినిమా విడుదల కానేలేదు అప్పుడే మరో బడా ప్రాజెక్టులో అవకాశం లభించడంతో ఇమాన్వి క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కి జోడిగా సురేందర్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్, హను రాగవపూడి కాంబినేషన్ లో వస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలపై దృష్టి పెడుతూనే.. మరొకవైపు కొత్త సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సుజీత్ తో సినిమా చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు సురేందర్ రెడ్డి సినిమాకి లాక్ చేశారు.. ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్క్రిప్ట్ కి తుదిమెరుపులు దిద్దుతుండగా.. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్విని తీసుకోవాలని చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నిజమైతే పాన్ ఇండియా క్రేజ్ గ్యారెంటీ..
అయితే ఇందులో అధికారిక ప్రకటన లేకపోయినా త్వరలో ఈమెను సంప్రదించి ఈమె డేట్స్ ను లాక్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇమాన్వికి ఇప్పుడు క్రేజ్ భారీగా పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఒకవేళ ఫౌజీ సినిమా కనుక మంచి విజయం అందుకుందంటే.. ఈమెకు వరుసగా అవకాశాలు తలుపుతడతాయి అనడంలో సందేహం లేదు.