సినిమా సెట్లలో అందాల కథానాయికల కష్టాల కథలు
ముఖ్యంగా నటీమణులు పీరియడ్స్ సమయంలో భారీ సెట్స్‌లో డాన్స్ నంబర్స్ చిత్రీకరణలో పాల్గొనడం శారీరకంగా, మానసికగా ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని.;
గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే కష్టం మామూలు విషయం కాదు. సినిమాలు, టీవీ షోల షూటింగుల సమయంలో మహిళా క్రూ లేదా సెట్లో పని చేసే నటీమణులు కొన్ని ఇబ్బందిక పరిస్థితులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా నటీమణులు పీరియడ్స్ సమయంలో భారీ సెట్స్‌లో డాన్స్ నంబర్స్ చిత్రీకరణలో పాల్గొనడం శారీరకంగా, మానసికగా ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి గందరగోళంలో చికాగ్గా ఉంటుందని చాలా మంది నటీమణులు తమ అనుభవ పాఠాల్ని చెప్పుకొచ్చారు.
ఇటీవల `దురంధర్` పాట చిత్రీకరణ సమయంలో డ్యాన్సింగ్ క్వీన్ అయేషా ఖాన్ తీవ్రమైన పీరియడ్స్ పెయిన్‌తో ఇబ్బంది పడ్డానని తెలిపారు. భారీ లెహంగా ధరించి కఠినమైన పరిస్థితుల్లో డాన్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఎంతో అసౌకర్యానికి గురయ్యానని వెల్లడించారు. అయితే వృత్తి పట్ల ఉన్న అంకితభావంతో ఆమె నొప్పిని భరిస్తూనే షూటింగ్ పూర్తి చేశారు. ఇలాంటి సమయాల్లో మహిళలకు విశ్రాంతి అవసరమని అయేషా తన ఆవేదనను తాజా ఇంటర్వ్యూలో బహిర్గతం చేసారు.
గతంలో పీరియడ్ సమస్యలు ఎదుర్కొన్న నటీమణులు ఉన్నారు. చాలామంది స్టార్ హీరోయిన్లు సెట్స్‌లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు బాహాటంగానే చెప్పారు. సమంత, రకుల్ ప్రీత్, తాప్సీ పన్ను లాంటి కథానాయికలు ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడేందుకు ఎప్పుడూ వెనకాడలేదు. భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు పీరియడ్స్ వల్ల కలిగే నీరసం, వెన్నునొప్పిని తట్టుకుంటూ పనిచేశానని గతంలో సమంత పేర్కొన్నారు. అవుట్‌డోర్ షూటింగ్స్‌లో ముఖ్యంగా అడవులు, మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ ఉన్నప్పుడు సరైన వాష్‌రూమ్ సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డామని రకుల్ ప్రీత్, తమన్నా లాంటి స్టార్లు చెప్పారు. పీరియడ్స్ సమయంలో కూడా 12-14 గంటల పాటు షూటింగ్ చేయాల్సి రావడం వల్ల కలిగే విపరీతమైన అలసట గురించి తాప్సీ పన్ను పలుమార్లు మాట్లాడారు. తమకు ఈ సమస్య ఉంది అని ఆ సమయంలో ఎవరికీ చెప్పుకోలేని స్థితి ఉంటుందని పలువురు టీవీ నటీమణులు గతంలో వెల్లడించారు. ఒక్కరి కోసం షూటింగ్ మొత్తం ఆపడం నిర్మాతకు చాలా నష్టంతో కూడుకున్నది. కాబట్టి తమ పరిస్థితులకు అనుగుణంగా, కొన్నిసార్లు దర్శకనిర్మాతలు షూటింగులను డిజైన్ చేస్తుంటారని కూడా కొందరు స్టార్లు వెల్లడించారు.
అయితే మారుతున్న కాలంతో పాటే సెట్లో పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల చిత్రబృందం సహకారం కూడా నటీమణులకు అందుతోంది. గతంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ ఇప్పుడు క్రమంగా మార్పు వస్తోందని ఒక ప్రముఖ నటీమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు కార వ్యాన్ లు ఉండేవి కావు. కనీసం కారవాన్ సౌకర్యం లేని సెట్స్‌లో మహిళలు ప్యాడ్స్ మార్చుకోవడానికి కూడా వీలుండేది కాదు. ప్రస్తుతం పెద్ద సినిమాల సెట్స్‌లో మెడికల్ టీమ్, పెయిన్ కిల్లర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. కొందరు నిర్మాతలు పీరియడ్స్ సమయంలో నటీమణులకు ఒక రోజు విశ్రాంతి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.. కానీ చిన్న సినిమాల విషయంలో టైట్ షెడ్యూల్స్ వల్ల ఇది సాధ్యపడటం లేదని ఒక ప్రముఖ నటీమణి వెల్లడించారు. జస్టిస్ హేమ కమిటీ కూడా మలయాళ చిత్రపరిశ్రమను అధ్యయనం చేసి మహిళామణులకు సెట్స్ లో ఉండే సమస్యలపై సుదీర్ఘ నివేదికను సమర్పించింది. ఆన్ లొకేషన్ వారికి అవసరమయ్యే సౌకర్యాలను ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉందని కూడా సూచించింది. మహిళా నటీమణులు, సాంకేతిక నిపుణులకు పీరియడ్స్ సమయంలో ఇబ్బంది ఉంటే వేతనంతో కూడిన సెలవు లేదా విరామం ఇవ్వాలి అని కమిటీ నిర్ధేశించింది.