బాక్సాఫీస్‌: ఈ వీకెండ్ ఎవ‌రి సీన్ ఎలా ఉంది?

Update: 2021-03-29 14:30 GMT
ఉప్పెన త‌ర్వాత క్లీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా జాతిర‌త్నాలు రికార్డులకెక్కింది. ఆ త‌ర్వాత రిలీజైన నాలుగైదు చిత్రాల స‌న్నివేశం ఎలా ఉంది? అన్న‌ది చూస్తే.. ఇప్పుడు థియేట‌ర్ల‌లో ఆడుతున్న వాటిలో అంతో ఇంతో `రంగ్ దే`కి మాత్ర‌మే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కంటెంట్ ప‌రంగా గొప్ప‌గా లేక‌పోయినా నితిన్ - కీర్తిల ఎన‌ర్జిటిక్ న‌ట‌న.. రొమాన్స్.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ జ‌నాన్ని థియేట‌ర్ల వైపు అడుగులు వేసేందుకు సాయ‌ప‌డుతున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.

మ‌రోవైపు ఈ సినిమాతో పాటు పోటీలో రిలీజైన అర‌ణ్య‌.. తెల్ల‌వారితే గురువారం సినిమాల బాక్సాఫీస్ ఫ‌లితం నిరాశాజ‌న‌కం అన్న రిపోర్ట్ ట్రేడ్ వ‌ర్గాల్లో స్ప‌ష్ఠంగా ఉంది. అర‌ణ్య అవార్డుల సినిమా.. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లో వీక్ అన్న చ‌ర్చా ట్రేడ్ లో సాగుతోంది. అడ‌వి నేప‌థ్యం సీరియ‌స్ డ్రామా సందేశం ఉన్న సినిమా కావ‌డంతో రానాకు అవార్డు రావొచ్చ‌న్న ప్ర‌శంస‌లు  కూడా ద‌క్కాయి. మ‌రోవైపు కీర‌వాణి వార‌సుడు శ్రీ‌సింహా న‌టించిన తెల్ల‌వారితే గురువారం చిత్రం ఫ్లాప్ గా మిగిలింద‌ని ట్రేడ్ వెల్ల‌డిస్తోంది.

ఇక వీట‌న్నిటి న‌డుమా ప‌రిమితంగా సెల‌క్టివ్ ఆడియెన్ కోసం వ‌చ్చిన  గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ చిత్రం హాలీవుడ్ ప్రియుల‌కు బాగా న‌చ్చుతోంది. యూత్ తో పాటు మ‌ధ్య వ‌య‌స్కులు ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్నార‌న్న రిపోర్ట్ ఉంది. అయితే మ‌ల్టీప్లెక్సుల్లోనే ఈ సినిమా ఆడుతోంది.

విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లో న‌డుస్తున్న జాతిర‌త్నాలు మూడవ వారాంతంలో కూడా మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. గత రెండు రోజుల్లో చాలా కేంద్రాల్లో వ‌సూళ్లు బాగున్నాయి. దీనికి తోడు హోలీ కారణంగా లాంగ్ వీకెండ్ కూడా ఈ చిత్రానికి కొంత ప్రయోజనం చేకూర‌నుంది. ఈ వారాంతం రిపోర్ట్ ఇదీ.
Tags:    

Similar News