సెకండ్ వేవ్ ప్ర‌భావంతో బాలీవుడ్ రిలీజ్ లు వాయిదా?

Update: 2021-04-03 17:30 GMT
రిలీజ్ కి షెడ్యూలింగ్ చేసిన సినిమాలు అనుకున్న ప్ర‌కారం విడుద‌ల‌వ్వ‌క‌‌పోతే ఆ న‌ష్టం అంతా ఇంతా కాదు. ఒక‌దాని వెంట ఒక‌టిగా ఈ స‌మ్మ‌ర్ లో భారీ సినిమాల రిలీజ్ ల‌కు బాలీవుడ్ నిర్మాత‌లు తేదీల్ని ఫిక్స్ చేసుకోగా.. ఇప్పుడు అవ‌న్నీ రిలీజ‌వుతాయో లేదో తెలీని ప‌రిస్థితి ఉంది.

ఓవైపు క‌రోనా మహ‌మ్మారీ ఉత్త‌రాదిన మెట్రో న‌గ‌రాల్లో అంత‌కంత‌కు పెరుగుతోంద‌ని రిపోర్టులు అందుతున్నాయి. ముంబై.. పూణే లాంటి చోట రాత్రి వేళ‌ల్లో ప్ర‌త్యేక ఆంక్ష‌ల్ని విధిస్తున్నారు. ప‌లు న‌గ‌రాల్లో క‌రోనా కేసులు పెద్ద‌గా న‌మోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ప్ర‌భావంతో త‌దుప‌రి బాలీవుడ్ పెద్ద సినిమాల‌ విడుదలల‌పై సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇప్ప‌టికే కరోనా ప్రభావం కారణంగా హిందీ చిత్రాల విడుదల నిల్ అయిపోయింది. ఉత్త‌రాదిన రిలీజ్ చేయాల‌నుకున్న‌ తెలుగు సినిమాలు తిరిగి వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడున్న స‌న్నివేశంలో హిందీ నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేంత ధైర్యం చేయడం లేదు.

అక్షయ్ కుమార్- రోహిత్ శెట్టి కాంబినేష‌న్ మూవీ `సూర్యవంశీ` చిత్రాన్ని విడుదల చేయడానికి ధైర్యం చేసి ఏప్రిల్ 30 ను విడుదల తేదీగా బ్లాక్ చేశారు. కానీ ఉత్త‌రాదిన‌ కేసులు పెరుగుతున్నందున సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నార‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వాయిదాపై మునుముందు చిత్ర‌బృందం ఒక‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ స‌మ్మ‌ర్ లో ఇత‌ర మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో డైల‌మా నెల‌కొంది. స‌ల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్ లాంటి హీరోల సినిమాల‌కు కాస్త గ‌డువు పెద్ద‌దే ఉంది కాబ‌ట్టి అప్ప‌టికి సెకండ్ వేవ్ ప్ర‌భావం త‌గ్గుతుంద‌న్న హోప్ అయితే ప‌రిశ్ర‌మ‌లో ఉంది.
Tags:    

Similar News