టాప్ స్టోరి: మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ని కొట్టేలా..!
దివంగత పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ (ఎంజే) ఒక సంచలనం. ప్రపంచవ్యాప్తంగా అతడి నృత్యవిన్యాసాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.;
దివంగత పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ (ఎంజే) ఒక సంచలనం. ప్రపంచవ్యాప్తంగా అతడి నృత్యవిన్యాసాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు వేదికపై ఆడి పాడుతుంటే, ఆ షోలో ప్రజల ఎమోషన్స్, కన్నీళ్లను లైవ్ లో వీక్షించేవాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి ఎమోషన్ వేరొక నటుడు లేదా డ్యాన్సర్ విషయంలో ఎప్పుడూ చూసి ఉండరు. కోట్లాదిగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు.
అయితే జాక్సన్ చనిపోయినా, అతడి పాటలకు ఇప్పటికీ యూట్యూబ్ ఆదాయంతో పాటు, రాయల్టీ వంటివి ఆ కుటుంబ సభ్యులు, ట్రస్ట్ కి చేరుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మైఖేల్ జాక్సన్ జీవితంపై అద్భుతమైన బయోపిక్ తెరకెక్కుతోంది. హాలీవుడ్ దర్శకుడు ఆంటోనీ ఫుక్వా తెరకెక్కిస్తున్న `మైఖేల్` చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఎంజే పాత్రను అతడి సొంత సోదరుడి కుమారుడు `జాఫర్ జాక్సన్` పోషిస్తున్నారు. జాక్సన్ బయోపిక్ కి భారతదేశంలో వసూళ్ల సునామీ ఖాయమా? అంటే ఖచ్చితంగా అవుననే అభిమానుల్లో చర్చ సాగుతోంది. భారత్‌లో మైఖేల్ జాక్సన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 80, 90వ దశకాల్లో ఆయన డ్యాన్స్ స్టైల్ ఒక విప్లవం సృష్టించింది. హాలీవుడ్ మ్యూజికల్ బయోపిక్‌లకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ఈ సినిమా కేవలం ఎంజే అభిమానులనే కాకుండా, నేటి తరం డ్యాన్సర్లను కూడా థియేటర్లకు రప్పిస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఇది వసూళ్ల రికార్డులు సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని అంచనా.
అయితే జాక్సన్ బయోపిక్ స్ఫూర్తితో భారతదేశంలో ఏవైనా కొరియోగ్రఫీ బేస్డ్ సినిమాలు రూపొందుతున్నాయా? హాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన డ్యాన్స్ బేస్డ్- బయోపిక్ సినిమాల వివరాల్లోకి వెళితే.. తెలిసిన సంగతులివి..
ప్రపంచవ్యాప్తంగా గొప్ప డ్యాన్సింగ్ స్టార్స్ బయోపిక్ చిత్రాలు:
డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ బయోపిక్స్ వివరాల్లోకి వెళితే.. ఆల్ దట్ జాజ్ (1979) అనే చిత్రం పాపులర్ కొరియోగ్రాఫర్ బాబ్ ఫోస్సే జీవితం ఆధారంగా తీసిన సెమీ ఆటోబయోగ్రఫీ. క్యూబన్ బ్యాలెట్ డ్యాన్సర్ కార్లోస్ అకోస్టా జీవిత కథ ఆధారంగా `యూలి` అనే చిత్రం 2018లో తెరకెక్కింది. రాక్ అండ్ రోల్ స్టార్ రిచీ వాలెన్స్ కథతో `లా బాంబా` అనే చిత్రం 1987లో విడుదలైంది. వైట్నీ హోస్టన్: ఐ వన్నా డ్యాన్స్ విత్ సమ్ బడీ చిత్రం 2022లో విడుదలైంది. ఇది సింగర్ బయోపిక్ అయినా కానీ వేదికలపై పెర్ఫార్మెన్స్‌లు, డ్యాన్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది.
భారతదేశంలో డ్యాన్సర్లు లేదా కొరియోగ్రాఫర్ల బయోపిక్ చిత్రాలు:
భారతదేశంలో ఇప్పటివరకు డ్యాన్స్ బేస్డ్ ప్యూర్ బయోపిక్స్ తక్కువగా వచ్చాయి. కానీ కొన్ని ముఖ్యమైన బయోపిక్ ల వివరాల్లోకి వెళితే.. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితంపై బయోపిక్ నిర్మాణంలో ఉంది. దీని హక్కులు టి సిరీస్ ఛేజిక్కించుకుంది. ఆధునిక భారతీయ నృత్య పితామహుడిగా పిలుపు అందుకున్న లెజెండరీ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ జీవితం ఆధారంగాను సినిమా విడుదలైంది. ఈయన జీవితంపై పూర్తిస్థాయి బయోపిక్ రాకపోయినా.. `కల్పన` (1948) సినిమా అతడి నృత్య ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది.
టాలీవుడ్‌లో లారెన్స్ మాస్టర్ `స్టైల్` :
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన `స్టైల్` (2006) సినిమా తెలుగులో ఒక క్లాసిక్ డ్యాన్స్ మూవీ. ఇది బయోపిక్ తరహా కాదు కానీ.. లారెన్స్ మాస్టర్ తన సొంత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాలను, డ్యాన్స్ పై తనకు ఉన్న మక్కువను ఈ సినిమాలో పాత్రల ద్వారా ప్రతిబింబించారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ నుండి టాప్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగే క్రమాన్ని ఇందులో చూపించారు.
బాలీవుడ్ `ABCD` ఫ్రాంఛైజీ.. `స్టెప్ అప్` స్ఫూర్తితో..
రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఎబిసిడి (ఎనీ బడీ కెన్ డాన్స్) ఫ్రాంఛైజీ దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉర్రూతలూగించింది. హాలీవుడ్ సినిమాల సిరీస్ `స్టెపప్` ప్రభావం ఈ సినిమాలపై ఉంది. ముఖ్యంగా డ్యాన్స్ బ్యాటిల్స్.. గ్రూప్ కాంపిటీషన్స్ ఇవన్నీ స్టెపప్ స్ఫూర్తితోనే తీర్చిదిద్దారు. ఈ ఫ్రాంఛైజీలో `ఎబిసిడి-2` కథ ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ముంబైకి చెందిన `ఫిక్టిటియస్ డ్యాన్స్ గ్రూప్` అనే టీమ్ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వరల్డ్ హిప్ హాప్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లడం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో డ్యాన్స్ మాస్టర్ గా ప్రభుదేవా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రకు కొంతవరకు `విష్ణు` అనే కల్పిత పేరు ఉన్నా, ఆయన నిజ జీవిత డ్యాన్స్ జర్నీ ఛాయలు అక్కడక్కడా కనిపిస్తాయి.