గబ్బర్ సింగ్ చూసి చూసి అలసిపోయాడు

Update: 2015-08-26 09:35 GMT
మన డైరెక్టర్లు తరచుగా ఓ మాట అంటుంటారు. మా హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథ, క్యారెక్టరైజేషన్ ఇది.. మా హీరోను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాం.. అని. కానీ చాలావరకు ఇవి అతిశయోక్తులుగానే ఉంటాయి. అభిమానులు కోరుకునే విధంగా చూపించి మెప్పించడం.. బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే క్యారెక్టరైజేషన్స్ తయారు చేయడం చిన్న విషయమేమీ కాదు. ఐతే గబ్బర్ సింగ్ సినిమా విషయంలో హరీష్ శంకర్  పవన్ ను అలా చూపించడంలో విజయవంతమయ్యాడు. నిజానికి ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ.. హిందీ సినిమా చూస్తే అది పవన్ కు సూటవుతుందనేమీ అనిపించదు. అందులో అంతా మందగమనం. కానీ హీరో క్యారెక్టరైజేషన్ లోని తిక్క అనే పాయింట్ ను బేస్ చేసుకుని.. పవన్ క్యారెక్టర్ ను భలేగా డిజైన్ చేశాడు. పవన్ లో ఉండే జోష్ ని, ఎనర్జీని వాడుకుని.. అభిమానులు తమ హీరోను ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు.

పవన్ తో సినిమా తీయాలనుకునే ఏ దర్శకుడైనా ఒక్కసారి ‘గబ్బర్ సింగ్’ చూసి తీరాల్సిందే. ఈ విషయంలో పవన్ సైతం ఆ సినిమా నుంచి ఇన్ స్పైర్ అవ్వాల్సింది చాలా ఉందనిపిస్తుంది. ‘గబ్బర్ సింగ్’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో బాబీ ఆ పనే చేస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికి వంద సార్లయినా తాను గబ్బర్ సింగ్ సినిమా చూసి ఉంటానని వెల్లడించాడు బాబి. మళ్లీ మళ్లీ చూస్తుంటే పవన్ ను ఈసారి ఎలా చూపించాలన్నది అర్థమవుతోందని.. హరీష్ ఓ అభిమాని కోణంలో పవన్ బాడీ లాంగ్వేజ్ ను చాలా బాగా అర్థం చేసుకుని.. గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్ ను తయారు చేశాడని చెప్పాడు బాబి. పవన్ తో కొన్ని నెలలుగా ట్రావెల్ చేస్తుంటే తనకు ఆయన క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ బాగా అర్థమయ్యాయని.. గబ్బర్ సింగ్ చూస్తున్నపుడు హరీష్ ఎలా ఆలోచించాడో, పవన్ ను ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తెలిసిందని బాబి చెప్పాడు. సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్రయత్నిస్తానని బాబి హామీ ఇచ్చాడు.
Tags:    

Similar News