తెలుగు సినిమాల్లో ఎన్టీఆరే తొలి 'హీరో' నా?

Update: 2018-11-26 12:00 GMT
సినీ హీరోల అభిమానులు తమ ఆరాధ్య దైవాల గురించి ఎంతగా అయినా గొప్పలు పోవచ్చు. వేరే హీరోల గురించి ఎలాంటి కామెంట్లయినా చేయొచ్చు. కానీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ఏ వ్యాఖ్య చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఒకరిని పొగిడే క్రమంలో ఇంకొకరిని తగ్గించే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ‘యన్.టి.ఆర్’ చిత్ర బృందం ఇదే పని చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ‘యన్.టి.ఆర్’ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం’ కోసం కానిస్టేబుల్ వేషం వేసుకుని నిర్మాత ఎల్వీ ప్రసాద్ తో మాట్లాడుతున్న స్టిల్ అది. ‘మనదేశం’ సినిమా రిలీజై 69 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

పోస్టర్ మీద ఈ విషయాన్ని వివరిస్తూ ‘వెండి తెర మీద హీరోయిజం మొదలై అరవై తొమ్మిదేళ్లయింది’  అని పేర్కొన్నారు. దీనికి దర్శకుడు క్రిష్ కూడా ఒక వ్యాఖ్య జోడించాడు. హీరోయిజాన్ని పరిచయం చేసిన అన్నగారిని పరిచయం చేసిన ఎల్వీ ప్రసాద్ గారిని గుర్తు చేసుకుంటూ అని కామెంట్ పెట్టాడు. ఇక్కడే వచ్చింది సమస్య. ఎన్టీఆర్ కంటే ముందు తెలుగు సినిమాల్లో హీరోలే లేరా అన్న చర్చ మొదలైంది. అప్పటికే ఏఎన్నార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. చిత్తూరు నాగయ్య సైతం స్టార్ స్టేటస్ సంపాదించారు. మరి ఎన్టీఆరే హీరోయిజాన్ని పరిచయం చేశాడని అనడం ఎంత వరకు సమంజసం? ఇదే ప్రశ్న సంధిస్తూ క్రిష్ పై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. ఎన్టీఆర్ వచ్చి హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన మాట వాస్తవం కానీ.. హీరోయిజాన్ని పరిచయం చేసిందే ఆయన అనడం మాత్రం అసమంజసం. క్రిష్ లాంటి బాధ్యతాయుతమైన దర్శకుడు ఇలాంటి కామెంట్ పెట్టడం తప్పే అంటున్నారు జనాలు.


Tags:    

Similar News