'మజిలీ' నిర్మాతలతో 'బాలకృష్ణ - అనిల్' సినిమా..?

Update: 2021-06-03 15:30 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేయాలని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. 'సుప్రీమ్' సినిమా హిట్ అయిన తర్వాత 'రామారావు' అనే స్క్రిప్ట్ తో బాలయ్యను మెప్పించడానికి ట్రై చేశాడు కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయినా సరే పట్టు విడవకుండా తన అభిమాన హీరోతో సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి.. మరో స్క్రిప్ట్ తో బాలయ్యను మెప్పించినట్లు టాక్ వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యునిక్ స్క్రిప్టు రెడీ చేస్తున్నానని.. ఇంతకముందు చూడని విధంగా బాలయ్యను చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని అన్నాడు. అయితే గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలకృష్ణ చేసేది అనిల్ సినిమానే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. అనిల్-బాలకృష్ణ కలయికలో రూపొందే చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని టాక్ నడుస్తోంది.

ఇంతకముందు 'మజిలీ' 'టక్ జగదీష్' చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ నిర్మాతలు.. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన 'గాలి సంపత్' చిత్రాన్ని రిలీజ్ చేశారు. అనిల్ సన్నిహితుడు ఎస్. కృష్ణ నిర్మించిన ఈ చిత్రం నష్టాలని మిగిల్చింది. దీంతో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో తన తదుపరి సినిమా చేస్తానని అనిల్ కమిట్ మెంట్ ఇచ్చాడట. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని హరీష్ పెద్ది - సాహు గారపాటి లతో చేయబోతున్నారట. ఇదే కనుక నిజమైతే వరుసగా 100 కోట్ల సినిమాలు తీస్తున్న అనిల్ రావిపూడి.. బాలయ్యతో ఏ రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో 'ఎఫ్ 3' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ క్రమంలో బాలయ్య - అనీల్ రావిపూడి కాంబోలో సినిమా ఉండే అవకాశం ఉంది
Tags:    

Similar News