సైబర్ స్కామ్ లో మోసపోయిన అప్ కమింగ్ హీరో.. ఏం జరిగిందంటే?

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.;

Update: 2026-01-14 19:30 GMT

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. తాజాగా అప్ కమింగ్ టాలీవుడ్ హీరో, ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైబర్ మోసానికి గురయ్యాడు. ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌ కు చెందిన ఓ దంపతులు అతడి నుంచి ఏకంగా రూ.60 లక్షలకు పైగా కాజేసినట్టు తెలుస్తోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, తేజ కుమారుడు అమితవ్ తేజ బిజినెస్ మ్యాన్ గా బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లోనే ఉంటుండగా, గత ఏడాది ఏప్రిల్ నెలలో మోతీనగర్‌ కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ అనే దంపతులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ట్రేడింగ్ రంగంలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని వారు అమితవ్‌ ను నమ్మించారు. ఒకవేళ పెట్టుబడిలో నష్టం వస్తే తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ ఫ్లాట్‌ ను ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.

దంపతుల మాటలు నమ్మిన అమితవ్ తొలుత కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టారట. అతడిని పూర్తిగా నమ్మించేందుకు వారం రోజుల తర్వాత ట్రేడింగ్‌ లో రూ.9 లక్షల లాభం వచ్చిందంటూ కొన్ని పత్రాలను చూపించారు. అవి నిజమని భావించి అమితవ్ విడతల వారీగా మరిన్ని డబ్బులు వారికి అందజేశారు. ఇలా మొత్తం కలిపి రూ.63 లక్షలు ఆ దంపతుల చేతిలో పెట్టారు. కానీ రోజులు గడుస్తున్నా లాభాల మాట అటుంచి అసలు పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు.

అమితవ్ ఫోన్ కాల్స్ చేయగా మొదట తప్పించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చి పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన అమితవ్ తేజ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అమితవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ యాక్ట్‌ తో పాటు చీటింగ్ కేసుల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

పరారీలో ఉన్న ఆ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే అమితవ్ తేజను దర్శకుడు తేజ త్వరలో హీరోగా పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఆ చిత్రంలో ఘట్టమనేని భారతి హీరోయిన్‌ గా నటించే అవకాశముందని తెలుస్తోంది. అలాగే అమితవ్ విదేశాల్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.

అయితే తన కుమారుడికి జరిగిన సైబర్ మోసం ఘటనపై ఇప్పటివరకు దర్శకుడు తేజ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మరోసారి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆ ఘటన గుర్తు చేస్తోంది. అధిక లాభాల ఆశ చూపించే ఆన్‌ లైన్ ట్రేడింగ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటూ హెచ్చరిస్తోంది.

Tags:    

Similar News