'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. జాతిరత్నాలు.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి..;

Update: 2026-01-14 08:25 GMT

'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ

నటీనటులు: నవీన్ పోలిశెట్టి - మీనాక్షి చౌదరి - రావు రమేష్ - తారక్ పొన్నప్ప - చమ్మక్ చంద్ర - మహేష్ మాస్టర్ రేవంత్ తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఛాయాగ్రహణం: యువరాజ్

నిర్మాతలు: నాగవంశీ - సాయి సౌజన్య

రచన: నవీన్ పోలిశెట్టి - చిన్మయి ఘాట్రాజు

దర్శకత్వం: మారి

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. జాతిరత్నాలు.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి.. కొంత విరామం తర్వాత అనగనగా ఒక రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: గోదావరి ప్రాంతానికి చెందిన రాజు (నవీన్ పోలిశెట్టి) పేరుకు జమీందారు కుటుంబ వారసుడే కానీ.. ఆస్తులన్నీ కరిగిపోవడంతో సామాన్యుడిలాగే జీవిస్తుంటాడు. తాను దర్జాగా బతకాలంటే బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే మార్గమని భావించిన రాజు.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాడు. అనేక సంబంధాలు చూశాక చివరికి పక్క ఊరికి చెందిన జమీందారు కుటుంబానికే చెందిన చారులత (మీనాక్షి చౌదరి)తో పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఆమెను ప్రేమలోకి దించడానికి తన మిత్ర బృందంతో కలిసి అనేక ప్రణాళికలు వేస్తాడు. అవన్నీ ఫలించి చారులత.. రాజును ప్రేమిస్తుంది. చారులత తండ్రి కూడా వీరి పెళ్లికి అంగీకరిస్తాడు. ఇద్దరికీ ఘనంగా వివాహం జరిపిస్తాడు. కానీ పెళ్లి తర్వాతే చారులత కుటుంబం గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది రాజుకు. ఆ విషయం ఏంటి.. అది తెలిశాక అతనెలా స్పందించాడు.. చారులతతో రాజు ప్రయాణం ఎలా సాగింది.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: నవీన్ పొలిశెట్టి.. చిన్న హింట్ ఇస్తే అల్లుకుపోయే రకం. అతడికి కావాల్సిందల్లా తన టైమింగ్ కు సరిపోయే క్యారెక్టర్.. కొంచెం విషయం ఉన్న కథ. అవి కుదిరాయంటే తన పెర్ఫామన్సుతో సినిమాను తీసుకెళ్లి మరో స్థాయిలో నిలబెట్టగల ప్రత్యేకమైన ప్రతిభ అతడిది. సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసిన అనుభవం ఉండడంతో తన బలానికి తగ్గట్లు తన పాత్రను.. సన్నివేశాలను మలుచుకోవడంలో భాగంగా రైటింగ్ లోనూ ఒక చేయి వేస్తుంటాడు నవీన్. ఈసారి అతను చిన్మయి ఘాట్రాజు అనే రచయితతో కలిసి సొంతంగా కథ-స్క్రీన్ ప్లే-మాటలు రాసుకుని మరీ రంగంలోకి దిగాడు. తన శైలికి నప్పే పాత్రను తనే తీర్చిదిద్దుకోవడంతో ‘అనగనగా ఒక రాజు’లో అతడికి ఎదురే లేకపోయింది. గోదావరి ప్రాంతంలో ఆడంబరంగా బతికే జమీందారు వారసుడి పాత్రను అణువణువునా ఎక్కించుకుని ఆ పాత్రలో నవీన్ జీవించేయడంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందుతుంది. యువత మాత్రమే కాక ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎంజాయ్ చేసేలా వినోదాల వల్లరిగా ‘అనగనగా ఒక రాజు’ తెరకెక్కింది. కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఉన్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్.

‘మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె..’ సామెతను గుర్తు చేసే పాత్ర ‘అనగనగా ఒక రాజు’లో హీరోది. ఇలాంటి టిపికల్ క్యారెక్టర్ నవీన్ చేతికి చిక్కితే అతను చెడుగుడు ఆడకుండా ఎలా ఉంటాడు? కాకపోతే నవీన్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో తన స్టైల్ చూసి.. గోదావరి భాష-యాసను అతనెంత ఆకళింపు చేసుకుంటాడో అన్న సందేహాలు కలుగుతాయి. కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ఈజీగా క్యారెక్టర్లో ఒదిగిపోయాడు నవీన్. తొలి సన్నివేశం నుంచే అతడి ఫ్లో మొదలైపోతుంది. జమీందారు వారసుడినంటూ బిల్డప్పులిస్తూ హడావుడి చేస్తూ సాగే తన క్యారెక్టర్ తో త్వరగా కనెక్ట్ అయిపోతాం. ఆ తర్వాత అతడి పెళ్లి ప్రయత్నాలతో కథ మరింత ఊపందుకుంటుంది. హీరోయిన్ని పడేయడానికి అతడు వేసే ప్రణాళికల చుట్టూ నడిచే సీన్లు భలేగా పేలాయి. ఓవైపు ట్రెండీగా అనిపించే సీన్లు.. ఇంకోవైపు నవీన్ పెర్ఫామెన్స్.. మరోవైపు అదిరిపోయే డైలాగులతో ప్రతి సీన్లోనూ ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది. హీరోకు అంతా అనుకూలంగా సాగిపోతుంటే.. ఇంటర్వెల్ దగ్గర కథలో ఏదో ఒక మలుపు ఉంటుందని.. హీరోకు షాక్ తగులుతుందని అర్థమైపోతుంది. అందుకు తగ్గట్లే ట్విస్ట్ ఉంటుంది. అది బాగా పేలింది.

ఇంటర్వెల్ తర్వాత కూడా ‘అనగనగా ఒక రాజు’ ఫన్ మూడ్ కొనసాగుతుంది. సన్నివేశాలు మంచి టెంపోతో సాగుతాయి. హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలని సెటిలైపోవాలని హీరో అనుకుంటే.. మరింత ఇబ్బందుల్లో పడడంతో కథ రసకందాయంలో పడుతుంది. ఇక తన కష్టాలన్నీ తీర్చుకోవడానికి ప్రెసిడెంటుగా పోటీ చేయాలని హీరో నిర్ణయించుకున్నాక రూరల్ పాలిటిక్స్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ దశలో కథనం కొంచెం నెమ్మదిస్తుంది. సన్నివేశాలు కూడా రొటీన్ అనిపిస్తాయి. చాలా సినిమాల్లో చూసిన సీన్లే ఇందులోనూ కనిపిస్తాయి. ఫ్లో కొంచెం దెబ్బ తింటున్న దశలో మళ్లీ నవీన్ అందుకుని కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాడు. ప్రి క్లైమాక్స్ నుంచి కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. నవీన్ లో ఇప్పటిదాకా చూడని ఎమోషనల్ యాంగిల్ ఇక్కడ చూస్తాం. అందులోనూ అతను ఆకట్టుకున్నాడు. కొంచెం మెలో డ్రామా ఎక్కువైనట్లు అనిపించినప్పటికీ.. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. మళ్లీ చివరికి నవ్వులతోనే ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటికి పంపిస్తాడు పొలిశెట్టి. సంక్రాంతి సీజన్లో పర్ఫెక్టుగా ఫిట్ అయ్యే కథ కావడం.. నవీన్ పొలిశెట్టి నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడం ‘అనగనగా ఒక రాజు’కు అతి పెద్ద బలాలు. కంటెంట్ పరంగా ఈ చిత్రం ‘సంక్రాంతి విన్నర్’ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

నటీనటులు: ఎలాంటి సినిమా చేసినా.. అందులో ఎంతమంది ఆర్టిస్టులున్నా ప్రేక్షకుల దృష్టంతా తన మీదే నిలిచేలా చేసుకునే స్పెషల్ టాలెంటు నవీన్ పొలిశెట్టిది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో అనుష్కను సైతం డామినేట్ చేసిన ఘనత తన సొంతం. ‘అనగనగా ఒక రాజు’లో అయితే పూర్తిగా అతడి వన్ మ్యాన్ షోను చూడొచ్చు. గోదావరి ప్రాంత మనుషుల ఆహార్యాన్ని.. తీరును.. భాషను యాసను పూర్తిగా ఆకళింపు చేసుకుని రాజు పాత్రలో అతను పెర్ఫామ్ చేసిన తీరుకు ఫిదా అయిపోతాం. నాన్ స్టాప్ ఫన్ తో ‘స్టార్ ఎంటర్టైనర్’ అని తనకున్న ట్యాగ్ కు పూర్తి న్యాయం చేశాడు నవీన్. కామెడీ ఎంత బాాగా చేశాడో.. ఎమోషన్లను కూడా అంతే పండించాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అందంగా కనిపిస్తూనే అభినయంతోనూ ఆకట్టుకుంది. రావు రమేష్ చిన్న పాత్రలో ఓకే అనిపించాడు. ఆయనకు స్క్రీన్ టైమ్ తగ్గింది. నెగెటివ్ రోల్ లో తారక్ పొన్నప్ప బాగానే చేశాడు. సహాయ పాత్రల్లో చమ్మక్ చంద్ర.. మహేష్ బాగా చేశారు. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ 'బుల్లిరాజు' రేవంత్ బాగా ఎంటర్టెన్ చేశాడు.

సాంకేతిక వర్గం: 'అనగనగా ఒక రాజు'కు సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. మిక్కీ జే మేయర్ తన శైలికి భిన్నంగా మంచి ఊపున్న పాటలు ఇచ్చాడు. ‘భీమవరం బాల్మా’ పాట బాగా పేలింది. మిక్కీ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. యువరాజ్ ఛాయాగ్రహణం బావుంది. విజువల్స్ సినిమా శైలికి తగ్గట్లు సాగాయి. సితార సంస్థ సంస్థ స్థాయికి తగ్గట్లే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి.. చిన్మయి ఘాట్రాజు కలిసి రాసిన స్క్రిప్ట్ సినిమాకు మేజర్ హైలైట్. వీళ్లిద్దరూ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. ఆర్గానిగ్గా వినోదం పండేలా చక్కటి సన్నివేశాలు రాసి వాటిని తెర మీద ఎగ్జిక్యూట్ చేశారు. మారి డైరెక్షన్ కూడా మెప్పించింది.

చివరగా: అనగనగా ఒక రాజు.. నవీన్ పోలిశెట్టి షో

రేటింగ్- 2.75/5

Tags:    

Similar News