డిమాండ్ ఎక్కువ, స్క్రీన్లు తక్కువ.. అనుకున్నట్లే మళ్లీ..

సంక్రాంతి పండుగ అంటే థియేటర్లలో పండుగ వాతావరణం పక్కా. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఊహించిన సమస్యే నిజమైంది.;

Update: 2026-01-14 19:32 GMT

సంక్రాంతి పండుగ అంటే థియేటర్లలో పండుగ వాతావరణం పక్కా. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఊహించిన సమస్యే నిజమైంది. సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని చిత్రాలకు అనూహ్యమైన స్పందన రావడంతో షోలు చాలక ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. డిమాండ్‌ కు తగ్గట్టు స్క్రీన్లు సర్దుబాటు చేయలేక డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. అందుకు ముఖ్య కారణం.. పొంగల్ రేసులో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి మంచి టాక్ రావడమే.

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో ముందుగా ఒప్పందం చేసుకున్న హాళ్లు సరిపోవడం లేదు. ఆన్‌ లైన్ బుకింగ్స్‌ తో పాటు కౌంటర్ వద్ద టికెట్ల కోసం క్యూలు కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగానే ఫుల్ అయిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే డిమాండ్ ఉన్నంతగా కొత్త స్క్రీన్లు పెంచే అవకాశం లేకపోవడం కలెక్షన్ల నెంబర్లపై ప్రభావం చూపిస్తోంది.

అదే సమయంలో ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ విషయంలో పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రిలీజ్ కు ముందు చేసుకున్న థియేటర్ ఒప్పందాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్లు పెద్దవిగా ఉండటంతో వెంటనే స్క్రీన్లు తగ్గిస్తే మొత్తం పరిస్థితి తలకిందులయ్యే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రోజులపాటు థియేటర్స్ లో సినిమా రన్ అయితే.. కొన్ని వసూళ్లు అయినా మేకర్స్ కు కలిసి వస్తాయి. అందుకే థియేటర్స్ తగ్గించే ప్రసక్తి లేనట్లే.

అదే సమయంలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయినా, రవితేజ గత చిత్రాలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉందనే అభిప్రాయం రావడంతో నెమ్మదిగా ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు. తొలి రోజు అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాకపోయినా.. ఇప్పుడు సినిమాకు రెస్పాన్స్ పర్లేదనేలా ఉంది. ఇంకా నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి షోస్ ఈవెనింగ్ స్టార్ట్ అయ్యాయి. ఆ రెండు సినిమాల రిజల్ట్ స్పష్టంగా తెలియాల్సి ఉంది. రెండు చిత్రాలకు సంబంధించి పాజిటివ్ వైబ్స్ బాగానే ఉన్నాయని వినికిడి. అదే సమయంలో ఇంకో కీలక అంశం ఏమిటంటే… ఆదివారం వరకు స్కూళ్లకు సెలవులు ఉండటం. పండగకు సొంత ఊర్లకు వచ్చిన ఫ్యామిలీస్ శనివారం వరకు థియేటర్లనే ప్రధాన ఎంటర్టైన్‌మెంట్ ఆప్షన్‌ గా ఎంచుకుంటున్నారు.

అందుకే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున జన సందడి కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎవరికెన్ని ఇవ్వాలి అనే విషయంలో డిస్ట్రిబ్యూటర్లు స్పష్టతకు రాలేకపోతున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి చివరకు ఏం జరుగుతుందో..

Tags:    

Similar News