రాజమౌళితో పోల్చడంపై అనిల్ ఏమన్నారంటే..
ఈ క్రమంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అనిల్ ఈ పోలికలపై చాలా వినయంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. వరుసగా తొమ్మిది హిట్లు అందుకుని 100% సక్సెస్ రేటుతో ఉన్న అనిల్ రావిపూడిని.. ఇప్పుడు చాలా మంది దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారితో పోలుస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అనిల్ ఈ పోలికలపై చాలా వినయంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తనను రాజమౌళి గారితో పోల్చడం అనేది తన జీవితంలోనే 'బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్' అని అనిల్ రావిపూడి సక్సెస్ మీట్ వేదికగా వెల్లడించారు. రాజమౌళి గారు ఒక ఐకానిక్ డైరెక్టర్ అని.. ఆయనను తాను ఎంతో గౌరవిస్తానని ఆయన తెలిపారు. కేవలం ఒక పోలికతోనే రాజమౌళి గారి స్థాయికి చేరిపోయాను అని తాను ఎప్పుడూ అనుకోనని స్పష్టం చేశారు.
ముఖ్యంగా రాజమౌళి గారితో తనను పోల్చుకుని తన స్థాయిని పెంచుకోవాలని తాను భావించనని అనిల్ ఈ సందర్భంగా చెప్పారు. అదే సమయంలో రాజమౌళి గారి స్థాయిని తగ్గించాలని కూడా తాను ఎన్నడూ కోరుకోనని అన్నారు. ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుందని.. రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ దర్శకుడని కొనియాడారు.
ప్రస్తుతం తాను రీజినల్ మార్కెట్‌లో తనకు తెలిసిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నానని అనిల్ రావిపూడి వివరించారు. రాజమౌళి గారు తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని పెంచారని.. ఆయన స్థాయి ఎప్పుడూ హై లెవెల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. కేవలం సక్సెస్ రేటును బట్టి కాకుండా ఆ మేకింగ్ స్టైల్ బట్టి రాజమౌళి గారిని గౌరవించాలని అనిల్ అభిప్రాయపడ్డారు.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ.. 'MSG' కేవలం రెండు రోజుల్లోనే 120 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం ఆనందంగా ఉందని అనిల్ తెలిపారు. సంక్రాంతి సీజన్ లో బాస్ ను అలా వింటేజ్ లుక్ లో చూపించాలనే తన చిరకాల కోరిక తీరినట్లు ఆయన వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జీ వల్లే ఈ కలెక్షన్లు సాధ్యమయ్యాయని ఆయన క్రెడిట్ మొత్తం బాస్ కు ఇచ్చేశారు. ఏదేమైనా తనను రాజమౌళి గారితో పోలుస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. తన పరిధిలో తాను ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే తన లక్ష్యమని అనిల్ రావిపూడి సక్సెస్ మీట్ ద్వారా స్పష్టం చేశారు.