నిర్మాత‌ల గిల్డ్ పై అలిగిన ఆర్టిస్టులు.. కార‌ణ‌మిదే!

Update: 2020-10-14 05:00 GMT
ప‌రిశ్ర‌మ‌ను శాసించేలా లేదా క‌ట్ట‌డి చేసేలా నిర్ణ‌యాలు తీసుకుంటే అందుకు ఫ‌లితం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప‌రిశ్ర‌మ మంచి కోస‌మే నిర్ణ‌యాలు తీసుకున్నా వాటిని వ్య‌తిరేకించే వ‌ర్గం పోగుప‌డుతుంది. ఇక ఇటీవ‌లి కాలంలో కాస్ట్ ఫెయిల్యూర్ గురించి ఆర్టిస్టులు హీరోలు హై ఎండ్ టెక్నీషియ‌న్ల పారితోషికాల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌రోనా క‌ల్లోలంలో టాలీవుడ్ స‌హా నిర్మాత‌లు క‌ష్టాల్లో ప‌డ్డారు. ఎగ్జిబిష‌న్ రంగం పూర్తిగా దెబ్బ తింది.

అందుక‌ని ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ త‌గ్గించే చ‌ర్య‌ల్ని చేప‌డుతున్నారు. ఇక ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించేందుకు నిర్మాత‌ల మండ‌లితో ప‌ని లేకుండా ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అసోసియేష‌న్ ప్ర‌య‌త్నించ‌డం స‌ర్వత్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌లి స‌మావేశంలో ఆర్టిస్టులు 20 శాతం మేర పారితోషికాలు త‌గ్గించుకోవాల‌ని గిల్డ్ వాళ్లు తీర్మానించ‌డం వేడెక్కించింది.

అయితే దీనిపై ఆర్టిస్టులు అలిగార‌ని తెలుస్తోంది. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)కు ఇప్ప‌టికే ఒక లేఖ‌ను ఆర్టిస్టులు అంద‌జేశారు. కాస్త భారీగా పారితోషికాలు గుంజేసే ఆర్టిస్టులు అయితే కంటికి కునుకు లేకుండా శాప‌నార్థాలు పెడుతూ ఉన్నార‌ట‌. మ‌హ‌మ్మారీ వ‌ల్ల త‌గ్గుతాం కానీ.. వైర‌స్ వెళ్లిపోయాక ప్రారంభ‌మ‌య్యే షూటింగుల‌కు పారితోషికాలు త‌గ్గ‌మ‌ని ఆర్టిస్టులు చాలామంది వాదిస్తున్నార‌ట‌. మా ద్వారా యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్ కి ఈ విష‌యం వెల్ల‌డించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. కోవిడ్ త‌ర్వాతా త‌మ‌ని దించేయ‌డం స‌రికాద‌నేది ఆర్టిస్టుల ఆవేద‌న‌. ఎంతో శ్ర‌మిస్తే కానీ ల‌క్ష‌ల్లో పారితోషికాలు రావ‌ని.. మాకేమీ కోట్ల‌లో ఇవ్వ‌ర‌ని కూడా అంటున్నార‌ట‌. ఇక పెద్ద హీరోల పారితోషికాలు త‌గ్గించ‌మంటే త‌గ్గుతారా? అన్న లాజిక‌ల్ ప్ర‌శ్న‌ను తెర‌పైకి తెచ్చార‌ట‌.
Tags:    

Similar News