దిగొచ్చిన స్టాండప్ కమెడియన్.. ఫ్యాన్స్ తగ్గుతారా?
స్టాండప్ కామెడీ పేరిట సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అనుదీప్ కటికాల వివాదం తాజాగా మలుపు తిరిగింది.;
స్టాండప్ కామెడీ పేరిట సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అనుదీప్ కటికాల వివాదం తాజాగా మలుపు తిరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నిహారిక కొణిదెల వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుదీప్ చివరకు దిగివచ్చి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.
కొద్ది రోజులుగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తన వీడియోపై తీవ్ర చర్చ జరుగుతోందని అనుదీప్ తెలిపారు. తన మాటల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే క్షమించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, తన వ్యాఖ్యలు కొందరికి బాధ కలిగించినట్లయితే అందరికీ క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మరింత జాగ్రత్తగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే అనుదీప్ క్షమాపణలతో వివాదం పూర్తిగా చల్లారలేదు. నవ్వించాలనే పేరుతో బూతులు మాట్లాడడం ఎందుకు, ఇప్పుడు సారీ చెప్పడమెందుకు అని నెటిజన్లు, మెగా ఫ్యామిలీ అభిమానులు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరైంది కాదని సూచిస్తున్నారు.
స్టాండప్ కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ అందించడమే గానీ, ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయడం కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ప్రతిభ ఉన్న ఇతర యువ కమెడియన్లకు కూడా చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కామెడీ క్లబ్ నిర్వాహకుల బాధ్యతపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
వేదికపై ఏమి మాట్లాడుతున్నారో పర్యవేక్షించకుండా టికెట్ల ఆదాయం కోసం ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం సరైంది కాదని అంటున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని అంతా సూచిస్తున్నారు. అయితే రీసెంట్ గా ముఖ్యంగా మెగా అభిమానులు అనుదీప్ షో జరిగే వద్దకు చేరుకుని నిరసనకు దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
అనుదీప్ అక్కడ ప్రదర్శన ఇస్తున్నారనే సమాచారం రావడంతో అభిమానులు క్లబ్ వద్దకు చేరుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రంగా మారుతుందనే అంచనాతో అనుదీప్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ వివాదం ప్రభావం నగరంలోని ఇతర కామెడీ వేదికలపైనా పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి హద్దులు దాటే వ్యాఖ్యలు ఎంతటి ప్రతికూల పరిణామాలకు దారి తీస్తాయో అనుదీప్ ఘటన స్పష్టం చేస్తోంది. పాపులారిటీ కోసం చీప్ కామెంట్స్ చేయడం కన్నా, టాలెంట్ ను నమ్ముకుని ముందుకు సాగాల్సిన అవసరాన్ని మరోసారి చాటి చెబుతోంది. ఏదేమైనా.. అనుదీప్ సారీ చెప్పినా.. ఫ్యాన్స్ తగ్గుతారో లేదో వేచి చూడాలి.