3 రోజుల్లోనే లాభాల్లోకి 'డెకాయిట్'.. ఇది కదా ప్లానింగ్ అంటే..

టాలీవుడ్‌ లో కంటెంట్‌ కు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ మరోసారి తన ఎంపికతో సక్సెస్ సాధించారు.;

Update: 2026-04-13 06:49 GMT

టాలీవుడ్‌ లో కంటెంట్‌ కు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ మరోసారి తన ఎంపికతో సక్సెస్ సాధించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ విడుదలైన మూడు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్‌ లోకి చేరి అందరినీ ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ భారీ కలెక్షన్లు సాధిస్తోంది.

లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ చిత్రానికి ప్రారంభం నుంచే మంచి హైప్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్‌లకు వచ్చిన స్పందనతో పాటు విడుదల తర్వాత పాజిటివ్ టాక్ రావడం సినిమాకు పెద్ద ప్లస్‌ గా మారింది. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. సినిమాలో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌ గా నటించారు.

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించారు. నటీనటుల ప్రదర్శన కూడా సినిమాకు అదనపు బలాన్ని అందించింది. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలకు ముందే తన ఖర్చులో ఎక్కువ భాగాన్ని రికవరీ చేసుకోవడం విశేషం. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా దాదాపు రూ.48 కోట్లు రాబట్టింది.

థియేట్రికల్‌ గా కేవలం రూ.17 కోట్లు వస్తే సరిపోతుందనే సేఫ్ జోన్‌ లోకి వెళ్లింది. కానీ విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ దాటింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు దక్కేలా పరిస్థితి మారింది. సినిమా ఇప్పటికే లాభాల జోన్‌ లోకి చేరడంతో సక్సెస్‌ ఫుల్ ప్రాజెక్ట్‌ గా డెకాయిట్ మారింది.

సరైన కంటెంట్‌ తో పాటు స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటే సినిమా ఎలా విజయవంతం అవుతుందో ఆ చిత్రం ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుండడంతో ఆ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మర్ సీజన్‌ ను సరిగ్గా ఉపయోగించుకున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత భారీ విజయాన్ని నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది.

ఇక సినిమాకు దర్శకుడు షానియల్ డియో కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్ నిర్మించారు. కథ, స్క్రీన్‌ ప్లేలో అడివి శేష్ కూడా భాగస్వామ్యం కావడం విశేషం. డైలాగ్స్‌ ను అబ్బూరి రవి అందించగా, సినిమాటోగ్రఫీ ధనుష్ భాస్కర్, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. మొత్తానికి, కంటెంట్‌ పై నమ్మకం, ముందస్తు వ్యూహాలు, సరైన రిలీజ్ టైమింగ్.. అన్నీ కలిస్తే సినిమా ఎలా సక్సెస్ అవుతుందో చూపించిన టెక్స్ట్‌ బుక్ ఉదాహరణగా డెకాయిట్ నిలిచింది.

Tags:    

Similar News