రూ.10 కోట్ల వ్యవహారం.. మంగ్లీకి సోషల్ మీడియా వల్లే సమస్యలా?

హైదరాబాద్‌ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు మరికొందరిపై రూ.10 కోట్ల మోసం జరిగిందని కేసు నమోదైంది.;

Update: 2026-04-13 05:05 GMT

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చుట్టూ మైక్రోఫైనాన్స్ మోసం ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కోట్ల రూపాయల వసూళ్ల కేసులో ఆమె పేరు వినిపించడంతో టాలీవుడ్‌ లో ఆ విషయం హాట్ టాపిక్‌ గా మారింది. అయితే ఆ ఆరోపణలను మంగ్లీ పూర్తిగా ఖండిస్తూ, తనపై కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు.

హైదరాబాద్‌ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు మరికొందరిపై రూ.10 కోట్ల మోసం జరిగిందని కేసు నమోదైంది. తార్నాకకు చెందిన అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేస్తూ, సుమారు 150 నుంచి 200 మంది బాధితుల నుంచి మైక్రోఫైనాన్స్ స్కీమ్ పేరిట డబ్బులు సేకరించి అధిక లాభాలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు.

మంగ్లీ ప్రజాదరణను ఉపయోగించుకొని ఆ వసూళ్లు జరిగాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఆరోపణలపై మంగ్లీ తీవ్రంగా స్పందించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో సుబ్బారావుపై కౌంటర్ కంప్లైంట్ ఇచ్చిన ఆమె, తాను ఎలాంటి వ్యాపారాల్లో పాల్గొనలేదని మరోసారి స్పష్టం చేశారు. 'ఆ వ్యాపారులతో నాకు ఉన్న పరిచయం కేవలం స్టేజ్ ప్రోగ్రామ్ల వరకే పరిమితం' అని తెలిపారు.

అలాగే సుబ్బారావు తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించాడని మంగ్లీ ఆరోపించారు. తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడని, ఇవ్వనందుకు బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంగ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

'ఎవరు ఏది పడితే అది రాయకండి. నిజాలు తెలుసుకుని మాత్రమే వార్తలు ఇవ్వండి' అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వల్లే తాను ఎదిగానని, కానీ అదే ఇప్పుడు తనకు శాపంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై రాజకీయ ముద్రలు కూడా వేస్తున్నారని, కానీ తాను 2003 తర్వాత ఎలాంటి పార్టీకి కూడా పాటలు పాడలేదని మంగ్లీ తెలిపారు.

'ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు ఇస్తామన్నా వెళ్లలేదు. అలాంటి నాకు ఈ 10 కోట్లు ఏమిటి?' అని ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, కోర్టుల వరకు వెళ్లడానికి కూడా వెనుకాడనని మంగ్లీ సవాల్ విసిరారు. తన పేరును ఉపయోగించి ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధితులకు తాను అండగా ఉంటానని కూడా ఆమె స్పష్టం చేశారు. మొత్తానికి.. మంగ్లీపై వచ్చిన మైక్రోఫైనాన్స్ ఆరోపణలు ఇప్పుడు పోలీసు దర్యాప్తు దశలోకి చేరాయి. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అప్పటివరకు ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య ఆ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News