40శాతం రీషూట్లు.. సూప‌ర్‌స్టార్‌కి బ‌డ్జెట్ గండం!?

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యుద్ధ చిత్రం `మాతృభూమి` ప్రస్తుతం తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది.;

Update: 2026-04-13 03:00 GMT

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యుద్ధ చిత్రం `మాతృభూమి` ప్రస్తుతం తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది. మొదట `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` అనే పేరుతో 2020లో తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రకటించారు. అయితే ప్రస్తుత దౌత్య పరిస్థితులు..దేశాల మధ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ ప్రాజెక్టులో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమాలోని వాస్తవికతను పక్కన పెట్టి దౌత్యపరమైన ఒత్తిళ్ల కారణంగా కథను మార్చాల్సి రావడం ఇప్పుడు సినిమా వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.

రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలో సినిమాలో ఎక్కడా `చైనా` అనే ప్రస్తావన రాకుండా మొత్తం స్క్రిప్ట్‌ను `శానిటైజ్` చేశారు. దీని కోసం ఏకంగా 40 శాతం సినిమాను రీషూట్ చేయాల్సి వచ్చింది. వాస్తవ సంఘటనలకు కల్పిత కథాంశాలను జోడిస్తూ.. కొత్తగా రొమాంటిక్ సన్నివేశాలు, ఫ్యామిలీ బ్యాక్‌స్టోరీలను చేర్చారు. చైనాను ప్రత్యర్థిగా చూపించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్న భార‌త‌ ప్రభుత్వ ఆందోళనతో మేకర్స్ ఒక ప్యూర్ వార్ డ్రామాను కాస్త కమర్షియల్ హంగులతో కూడిన `మసాలా సినిమా`గా మార్చేయడం గమనార్హం.

ఈ పరిణామాల వల్ల సినిమా ప్రామాణికత దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి. చరిత్రలో నమోదైన ఒక కీలక యుద్ధాన్ని తెరపైకి తెచ్చేటప్పుడు శత్రువు ఎవరో చెప్పకుండా కేవలం యుద్ధం జరిగిందని చూపించడం వల్ల చారిత్రక వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే ప్రమాదం ఉంది. సినిమా అనేది సమాజంపై బలమైన ప్రభావం చూపే మాధ్యమం కాబట్టి వాస్తవాలను దాచడం వల్ల భవిష్యత్ తరాలకు ఆ సంఘటనపై సరైన అవగాహన కలగదు. ఇది కేవలం ఒక ప్రచార సాధనంగా మిగిలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు శత్రువును స్పష్టంగా చూపించకపోవడం వల్ల సినిమాలో ఉండాల్సిన భావోద్వేగాల తీవ్రత తగ్గిపోతుంది. గల్వాన్ లోయలో మన సైనికులు ఎవరితో పోరాడారో.. ప్రాణత్యాగం ఎవరి కోసం చేశారో ప్రేక్షకులకు ఇప్పటికే తెలుసు. కానీ తెరపై ఒక అజ్ఞాత శత్రువుతో పోరాటం సాగిస్తున్నట్లు చూపిస్తే... ఆ త్యాగంలోని ఘాఢత పలచన అవుతుంది. సృజనాత్మక స్వేచ్ఛకు, దేశ ప్రయోజనాలకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో అంతిమంగా సినిమా ఒక బయోపిక్ లేదా వార్ డ్రామా స్థాయి నుండి దిగజారి.. సాధారణ యాక్షన్ సినిమాగా మారిపోతోంది.

అంతర్జాతీయ సంబంధాలు ముఖ్యం కాదనలేం కానీ.. ఒక కళాఖండంగా నిలవాల్సిన సినిమా ప్రభుత్వ నిబంధనల మధ్య నలిగిపోవడం విచారకరం. ఇప్పటికే చైనా మీడియా నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో మేకర్స్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రక్షణ శాఖ నుంచి ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు (ఎన్‌.వో.సీ) లభించలేదు. ప్రామాణికతను పూర్తిగా పక్కన పెట్టి చేసే ఇలాంటి మార్పులు సినిమాను ఆత్మలేని వినోదంగా మార్చేస్తాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని స్థితిలో ఉన్నా.. ఒక గొప్ప యుద్ధ గాథను మసాలా చిత్రంగా మార్చే ప్రక్రియ మాత్రం చర్చనీయాంశంగానే మిగిలిపోతుంది.

రీషూటింగ్ ప్రక్రియ:

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా `మాతృభూమి` సినిమాలోని దాదాపు 40 శాతం భాగాన్ని మళ్ళీ షూట్ చేస్తున్నారు. ఇందులో కొత్తగా కల్పిత కథాంశాలు, రొమాంటిక్ సీన్లు.. బ్యాక్‌స్టోరీలను జోడించారు. సినిమాలో ఎక్కడా `చైనా` అనే పేరు వినిపించకుండా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. దీనికి అనుగుణంగా మేకర్స్ సినిమాను శానిటైజ్ (మార్పులు) చేస్తున్నారు. దీని కార‌ణంగా బ‌డ్జెట్లు పెరిగి నిర్మాత అయిన స‌ల్మాన్ కి అద‌న‌పు భారం పెరిగింద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News