మొద‌టి సినిమా కామెంట్లు.. ఇంట్లోవాళ్ల‌పై అస‌భ్యత‌కు ఏడ్చేసాను: వ‌రుణ్ తేజ్

మెగా కాంపౌండ్ లోనే వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుని ప్ర‌యోగాల‌తో అల‌రించిన హీరో వ‌రుణ్ తేజ్. అత‌డు న‌టించిన `కొరియ‌న్ క‌న‌క‌రాజు` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Update: 2026-08-06 03:41 GMT

మెగా కాంపౌండ్ లోనే వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుని ప్ర‌యోగాల‌తో అల‌రించిన హీరో వ‌రుణ్ తేజ్. అత‌డు న‌టించిన `కొరియ‌న్ క‌న‌క‌రాజు` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్ల‌తో వ‌రుణ్ బిజీబిజీగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో ప‌లు పాడ్ కాస్ట్ ల‌లో కూడా మాట్లాడుతూ.. వ్య‌క్తిగ‌త‌- వృత్తిగ‌త విష‌యాల‌ను ముచ్చ‌టిస్తున్నాడు. ముఖ్యంగా ఫ్యాన్ వార్స్ గురించి.. త‌న మొద‌టి సినిమా స‌మ‌యంలో ట్రోలింగ్ గురించి అత‌డు వెల్ల‌డించాడు. వరల్డ్ రిలేషన్‌షిప్స్, సోషల్ మీడియా ప్రభావం గురించి వ‌రుణ్ ముచ్చ‌టించారు.

స్కూల్ డేస్‌లో అభిమానుల మధ్య ఉండే ఆప్యాయత- స్నేహానుబంధం ఎంతో ప్రత్యేకమైనవి. శ్రేయోభిలాషులైన ఫ్రెండ్స్ ఇత‌ర నటులను అభిమానించేవారు. అయితే ఫ్యానిజం అనేది ఎప్పుడూ విషపూరితమైన పోటీగా మారలేదని వ‌రుణ్ అన్నారు. పాఠశాల వయస్సులో ఇతర హీరోల అభిమానులైన మిత్రులతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం... ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకోవడం వంటి ఆరోగ్యకరమైన వాతావరణం అప్పట్లో ఉండేది.

సోషల్ మీడియా యుగంలో ట్రోలింగ్ , విమర్శల ధోరణి తీవ్రంగా మారింది. గతంలో ఆన్‌లైన్ ఫోరమ్‌లు... ఆర్కుట్ లేదా ఫేస్‌బుక్‌లలో కేవలం టెక్స్ట్‌ రూపంలో వ్యాఖ్యలు ఉండేవి. కానీ నేడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలపై మీమ్స్, ఫోటోలు, వీడియోల రూపంలో వ్యంగ్య ప్రచారాలు పెరిగిపోయాయి. కాలంతో పాటు ట్రోలింగ్ చేసే విధానం మారినా.. సమాజంలో దీని ప్రభావం ఎప్పుడూ ఉంటూనే ఉంద‌ని వ‌రుణ్ అన్నారు.

వ్యక్తిగత విమర్శలను ఎదుర్కోవడం వేరు... కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసే హేయమైన కామెంట్లు ఎవరినైనా తీవ్రంగా గాయపరుస్తాయి. తన మొదటి సినిమా విడుదలైన సమయంలో త‌న‌పైనా త‌న కుటుంబంపైనా నెట్‌లో వచ్చిన అసభ్యకరమైన, దారుణమైన వ్యాఖ్యలను చూసి తీవ్ర మనస్తాపానికి గురై ఏడ్చిన అనుభవాన్ని వ‌రుణ్ రివీల్ చూసారు. ఆరంభంలో ఇటువంటి అనుభవాలు మానసికంగా ఎంతో బాధించినా.. సమయం గడిచేకొద్దీ వాస్తవాన్ని గ్రహించాల్సి వస్తుంది.

సినిమాలు లేదా నటన నచ్చకపోతే దానిని గౌరవప్రదంగా చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం లేదా అనవసరమైన ద్వేషాన్ని వెళ్లగక్కడం ఎంతమాత్రం తగదు. ఈ ప్రపంచంలో ఎటువంటి కారణం లేకుండా ద్వేషించే వ్యక్తులు ఉంటారని గ్రహించి... అటువంటి అనుచిత విమర్శలను పట్టించుకోకుండా వదిలేయడమే సరైన మార్గమని వ‌రుణ్ తేజ్ తాను ఎంచుకున్న మార్గంపై స్పష్టత‌నిచ్చారు.

అయితే ట్రోల‌ర్స్ గ్ర‌హించాల్సింది ఉంది. అన్ని రకాల ట్రోల్స్ చెడు కావు... హుందాగా, సరదాగా ఉండే మీమ్స్, కామెడీ ట్రోల్స్‌ను ఆస్వాధించవచ్చు. పెద్ద నటులు సైతం తమపై వచ్చే ఫన్నీ ట్రోల్స్‌ను నవ్వుతూ స్వీకరిస్తారు. జీవితంలో స‌మ‌తుల్య‌త‌, పరిణతి ఉన్నప్పుడు.. హానికరమైన ద్వేషాన్ని పక్కన పెట్టి... కేవలం వినోదాన్ని మాత్రమే స్వీకరించడం సాధ్యమవుతుంది. వ‌రుణ్ తేజ్ న‌టించిన కొరియ‌న్ కన‌క‌రాజు చిత్రం ఈ శుక్ర‌వారం (7న‌) గ్రాండ్ గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. క‌న‌క‌రాజు ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న రావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి.

Tags:    

Similar News