కావేరీ గొడవ.. అరవింద్ స్వామి మెసేజ్ అద్భుతం

Update: 2018-04-12 06:26 GMT
తమిళనాడును కొన్ని రోజులుగా కావేరీ జల వివాదం కుదిపేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్య ఇప్పుడు మరింత జఠిలంగా మారింది. కొన్ని రోజులుగా అన్ని రాజకీయ పక్షాల నాయకులు.. అలాగే సినిమా వాళ్లు ఉద్ధృతంగా ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకోవడానికే చాలామంది ప్రయత్నిస్తున్నారు. చివరికి రాజకీయాల్లో మార్పు తెస్తామంటున్న సూపర్ స్టార్ రజనీ కాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్ సైతం ఈ వ్యవహారంలో సగటు రాజకీయ నాయకుల్లాగే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి ట్విట్టర్లో ఒక కవిత రూపంలో పెట్టిన ఒక మెసేజ్ సంచలనం రేపుతోంది. సంప్రదాయ రాజకీయ నాయకులతో పాటు రజినీ.. కమల్ లకు సైతం గట్టిగా తగిలేలా ఉన్న ఈ మెసేజ్ అద్భుతం అనే చెప్పాలి.

నీటి పేరుతో జరుగుతున్న రాజకీయాన్ని అరవింద్ ఎండగట్టాడు. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ వాటర్’ పేరుతో  కవిత రాశాడు అరవింద్. భారతీయుల మీదికి భారతీయుల్నే ఉసిగొల్పుతున్నారని.. ఒక దేశానికి చెందిన జనాలే ఒకరికొకరు శత్రువులు అయిపోయారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడి విజయం సాధించామని.. ఆ ఘన వారసత్వాన్ని మరిచిపోయి.. ఇప్పుడు నీటి కోసం.. కులం కోసం.. మతం కోసం కొట్టుకునే పరిస్థితి తలెత్తిందని అతనన్నాడు. ఏ విషయంలోనూ దేశంలో సహనం లేకపోతోందని.. ఒక అభిప్రాయానికి విలువ లేదని.. అహింసకు విలువ లేదని.. తెలివైన వాళ్లందరూ నిరసన మార్గం ఎంచుకున్నారని.. తాము నియంత్రించలేని జనాలకు సుద్దులు చెబుతున్నారని.. పసుపు రంగు దుస్తులేసుకున్న వాళ్లపై (చెన్నై సూపర్ కింగ్స్ జట్టునుద్దేశించి).. ఖాకీలపై జులుం ప్రదర్శిస్తున్నారని అన్నాడు అరవింద్. ప్రస్తుత రాజకీయ వ్యవహారాలపై తమిళనాట తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నప్పటికీ సినీ ప్రముఖులెవరూ వాస్తవం మాట్లాడటానికి ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో అరవింద్ స్వామి చాలా డేరింగ్ గా స్పందించాడంటూ ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.


Tags:    

Similar News