హాట్ టాపిక్‌: `వైజాగ్ టాలీవుడ్` ప్ర‌ధాన అజెండా?

Update: 2020-06-09 03:45 GMT
బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రానికి ఉన్న ప్ర‌త్యేక‌త‌ల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో అంద‌మైన చారిత్రాత్మ‌క మైన న‌గ‌రంగా ప్ర‌సిద్ధి చెందింది. అద్భుత‌మైన బీచ్ లు.. పార్క్ లు.. కొండ ప‌రిస‌రాలు స‌హా ప్ర‌కృతిలో ది బెస్ట్ అనిపించిన న‌గ‌ర‌మిది. బ్రిటీష్ వారి కంటే ముందు ఇక్క‌డ డ‌చ్ వాళ్లు..  వ్యాపార కార్య‌క‌లాపాలు సాగించారు. విశాఖ భీమిలి బీచ్ ప‌రిస‌రాల్లో డ‌చ్ శ్మ‌శాన వాటిక ఇప్ప‌టికీ చారిత్ర‌క ఆన‌వాలు. ప్ర‌స్తుతం ఏపీ సీఎం విశాఖ రాజ‌ధానిని ప్ర‌క‌టించ‌డంతో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

విశాఖ‌- భీమిలిలోనే ఏపీ రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ - విజ‌య సాయి రెడ్డి బృందం ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. విశాఖ‌- పెందుర్తి నుంచి విజ‌య‌న‌గ‌రం వ‌ర‌కూ ఉన్న ఆరు లైన్ల రోడ్ వెంబ‌డి భూముల్ని సేక‌రించి ప్ర‌స్తుతం త‌లపెట్టిన రాజ‌ధానిని నిర్మించాల‌న్న‌ది సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహం. కేవ‌లం ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ మాత్ర‌మే కాదు.. ఇక్క‌డ ఐటీ- ప‌రిశ్ర‌మ‌లు స‌హా సినీ రంగాన్ని అభివృద్ధి చేయాల‌న్న‌ది జ‌గ‌న్ - విజ‌య‌సాయిరెడ్డి- అవంతి శ్రీ‌నివాస్ బృందం యోచ‌న‌.

ఇక వైజాగ్ టాలీవుడ్ అభివృద్ధి కోసం ఏం చేయాలో మెగాస్టార్ చిరంజీవి స‌హా సినీపెద్ద‌ల్ని  ప్ర‌శ్నించ‌డం ద్వారా వైయ‌స్ జ‌గ‌న్ మైండ్ లో ఏం ఉందో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు అర్థ‌మైంది. అందుకే నేటి (జూన్ 10) భేటీలో `వైజాగ్ టాలీవుడ్` అన్న చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించ‌డ‌మే గాక‌.. ప్ర‌స్తుత క్రైసిస్ లో షూటింగుల‌కు అనుమ‌తించిన జ‌గ‌న్ కి కృతజ్ఞ‌త‌లు చెప్ప‌డం ప్ర‌ధాన ఉద్ధేశం. అందుకు చిరంజీవి అధ్య‌క్ష‌త‌న గంప‌గుత్త‌గా ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఈ భేటీకి త‌ర‌లి వెళుతున్నారు. ఇది ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న మీటింగ్. నేటి భేటీ ఒక చారిత్రాత్మ‌క మైన నిర్ణ‌యానికి ఆలంబ‌న కావొచ్చ‌న్న వూహాగానాలు సాగుతున్నాయి.

వైజాగ్ లో టాలీవుడ్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స్టూడియోల‌కు స్థ‌లాల్ని ఇవ్వాల్సిందిగా సినీపెద్ద‌లు ఈ భేటీలో కోర‌నున్నారు. మ‌రో టాలీవుడ్ నిర్మాణానికి స‌రైన స‌మ‌య‌మిదేన‌ని చిరంజీవి స‌హా ప్రభృతులు భావిస్తున్నారు. అందుకు అన్నివిధాలా స‌హ‌క‌రించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారన్న చ‌ర్చా సాగుతోంది.

చెన్న‌య్ నుంచి హైద‌రాబాద్ కి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించ‌డంలో ఏఎన్నార్ - రామానాయుడు- దాస‌రి పేర్లు వినిపించాయి. ప్ర‌స్తుత స‌న్నివేశంలో హైద‌రాబాద్ నుంచి వైజాగ్ కి టాలీవుడ్ ని త‌ర‌లించ‌డంలో మెగా స్టార్ చిరంజీవి  పేరు వినిపించ‌డం ఖాయం చేసుకోవాల‌నే ఉద్ధేశం స్ఫ‌ష్ఠ‌మ‌వుతోంది. హైద‌రాబాద్ లో ఒక ప‌రిశ్ర‌మ‌.. ``వైజాగ్ మెగా టాలీవుడ్`` హాంకాంగ్ ఇండ‌స్ట్రీలాగా ఇంకోటి.. అభివృద్ధి చెందాలన్న‌ది సినీపెద్ద‌ల ఆలోచ‌న‌. విశాఖ రుషి కొండ బీచ్ ప‌రిస‌రాల్లో రామానాయుడు స్టూడియోస్ ఇప్ప‌టికే అందుబాటు లో ఉంది. యాక్టివ్ గా షూటింగులు జ‌రుగుతున్నాయి. ఆ ప‌రిస‌రాల్లోనే మ‌రిన్ని స్టూడియోల నిర్మాణం సాగ‌నుందా?  లేక ఇంకేవైనా భూముల్ని ప‌రిశీలిస్తారా? అన్న గుస‌గుస‌లు అప్పుడే ప‌రిశ్ర‌మ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

నేటి ఏపీ సీఎం జ‌గ‌న్ మీటింగులో మెగాస్టార్ మాట్లాడ‌ద‌ల‌చిన అతి ముఖ్య‌మైన పాయింట్ .. వైజాగ్ టాలీవుడ్.. మెగా స్టూడియోస్ నిర్మాణం.. దాంతో పాటే ఏవీఎం వంటి ప్ర‌ముఖ స్టూడియో అధినేత‌ల‌కు ఆహ్వానం ఉంటుంద‌ని ఊహిస్తున్నారు. ఎస్.ఎస్.రాజ‌మౌళి.. శ్యాంప్ర‌సాద్ రెడ్డి వంటి దిగ్గ‌జాల ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇండ‌స్ట్రీ షిఫ్టింగుకి 2000-5000 ఎక‌రాలు పెందుర్తి కొత్త వ‌ల‌స నుంచి అర‌కు పోయే వ‌ర‌కూ మెట్ట భూములు ప‌నికిరాని కాస్ట్ లెస్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని ప‌రిశీలిస్తారా? అన్న గుసగుసా తాజాగా వేడెక్కిస్తోంది.  

సీఎం జ‌గ‌న్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.. వైసీపీ మంత్రి అవంతి.. తేదేపా నాయ‌కుడు గంటా శ్రీ‌నివాస‌రావు ఉబ‌లాట‌ప‌డుతున్నారు క‌దా?  వీళ్లంద‌రిలోనూ ఉత్సాహం నింపే స‌రైన నిర్ణ‌యం నేడు తీసుకుంటారా? అన్న‌ది వేచి చూడాలి. ఇక ఈ భేటీకి అన్నీ పెద్ద తలకాయలే..అటెండ‌వుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యాన్ని వహించే ఈ టీమ్‌లో అక్కినేని నాగార్జున- రాజమౌళి- త్రివిక్రమ్ శ్రీనివాస్- కొరటాల శివ- శ్యామ్ ప్రసాద్ రెడ్డి- జెమిని కిరణ్- జీవిత- రాజశేఖర్- సీ కల్యాణ్- దామోదర్ ప్రసాద్- ప్రసన్నకుమార్- ఛోటా కే నాయుడు వంటి ప్రముఖులు ఉన్నారు. విశాఖలో చిత్ర పరిశ్రమను స్థాపించడానికి పుష్కలమైన వనరులు ఉన్నాయనే అంశాన్ని పెద్ద‌లంతా విన్న‌వించ‌నున్నార‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి.

చ‌రిత్ర ఒక‌సారే లిఖిస్తారు..అలాంటి రేర్ ఛాయిస్ ఇప్పుడే.. మెగాస్టార్ కి అలాంటి చ‌రిత్ర రాసే ఒకే ఒక్క అవ‌కాశం.. ద‌క్క‌నుందా లేదా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్ గా మారింది.
Tags:    

Similar News