విన్నర్ విలన్.. రోజుకు కిలో చికెన్, 40 గుడ్లు

Update: 2017-02-22 15:29 GMT
అనూప్ సింగ్ ఠాకూర్.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో ఈ పేరు కొంచెం గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవలే హిట్ టాక్‌‌ తో మొదలైన సూర్య సినిమా ‘ఎస్-3’లో అతనే విలన్. అంతే కాదు.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సాయిధరమ్ తేజ్ మూవీ ‘విన్నర్’లోనూ విలన్ పాత్ర అతడిదే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘రోగ్’లోనూ అతడు సైకో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇతడి నేపథ్యం ఆసక్తికరం. హిందీలో తెరకెక్కిన ‘మహాభారతం’ సీరియల్లో అనూప్ సింగ్.. ధృతరాష్ట్రుడి పాత్ర పోషించడం విశేషం. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు అనూపే.

‘విన్నర్’తో నేరుగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న నేపథ్యంలో టాలీవుడ్ మీడియాను కలిసిన అనూప్.. తాను మిస్టర్ వరల్డ్ కావడానికి ఎంత కష్టపడిందీ వివరించాడు. ‘‘ఫిట్నెస్ ఫిజిక్ కేటగిరిలో మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిని నేను. 47 దేశాల వాళ్లతో పోటీ పడి ఈ టైటిల్ గెలిచా. అందుకోసం మామూలు కష్టం పడలేదు. రోజుకు మూడుసార్లు జిమ్ చేసేవాడిని. రోజుకు ఒక కేజీ చికెన్.. 40 ఎగ్ వైట్స్ తినేవాడిని. రెండేళ్ల పాటు నేను అన్నమన్నదే ముట్టలేదు. చికెన్.. కూరగాయలు మాత్రమే తిన్నాను. మిస్టర్ వరల్డ్ కావాలంటే పిచ్చోడైపోవాలి. దాని పట్ల ఎంతో కోరిక ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఏం తింటున్నామో తెలుసుకుని తినాలి. రెండేళ్ల పాటు దాని కోసం ప్రాణం పెట్టి కష్టపడితే టైటిల్ దక్కింది’’ అని అనూప్ సింగ్ తెలిపాడు. తెలుగులో ప్రభాస్‌ తో నటించాలన్నది తన డ్రీమ్ అని అనూప్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News