సుశాంత్ కేసు సీబీఐకివ్వండి.. అమిత్ షా స్పందన

Update: 2020-07-15 14:00 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లోని సినీ మాఫియా, ఆధిపత్య పోరు బయటపడ్డ సంగతి తెలిసిందే. సుశాంత్ కు అవకాశాలు దక్కకుండా చేసి ఆత్మహత్యకు కారణమయ్యారని పలువురు అగ్ర నిర్మాతలు, దర్శకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నెలరోజులుగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ ఊపందుకుంది.

తాజాగా ప్రముఖ బీహార్ కు చెందిన జన్ అధికార్ పార్టీ నేత పప్పూ యాదవ్ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సుశాంత్ కేసులో అనేక అనుమానాలు.. సందేహాలున్నాయని.. ఆయన మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లేఖలో కోరారు.

కాగా పప్పూ యాదవ్ లేఖపై అమిత్ షా స్పందించారు. తిరిగి లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో లేదని.. కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుందని.. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సిఫారసు చేశానని అమిత్ షా రాసిన ప్రతిలేఖలో పేర్కొన్నారు.

అమిత్ షా రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పప్పూ యాదవ్.. మీరు తలుచుకుంటే నిమిషంలో సీబీఐకి కేసు ఇవ్వగలరు అంటూ మా వినతిని పరిగణలోకి తీసుకోవాలంటూ విన్నవించారు. బీహార్ కు చెందిన సుశాంత్ మరణాన్ని అక్కడి నేతలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒత్తిడి చేస్తున్నారు.
Tags:    

Similar News