అక్కినేని హీరో మాసిజం... ఏ రేంజిలో అంటే... ?

Update: 2021-12-28 04:35 GMT
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా ఎన్టీయార్ని, ఏయన్నార్ ని చెప్పుకుంటారు. నందమూరి వారు మాస్ కి ప్రతినిధి అయితే అక్కినేని వారు క్లాస్ కి కిరీటం పెట్టారు. ఈ ఇద్దరు హీరోల వారసులు కూడా అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎన్టీయార్ వరసులు బాలయ్య అయినా జూనియర్ అయినా పక్కా మాస్ హీరోలు. ఇక అక్కినేని వారసులుగా నాగార్జున క్లాస్ హీరోగానే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఆయన నట వారసులు నాగ చైతన్య, అఖిల్ సైతం అదే రూట్లో వెళ్తూ వచ్చారు.

అయితే అఖిల్ మాత్రం ఇపుడు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు. ఇకపైన తన రూటే సెపరేట్ అంటున్నాడు. పక్కా మాస్ హీరో ఇమేజ్ కోసం అఖిల్ ఏకంగా తపస్సే చేస్తున్నాడు. తన ఒంటిని నానా కష్టాల పాలు చేస్తున్నాడు. కఠినమైన కసరత్తులు చేస్తూ భారీగా కండలు పెంచేస్తున్నాడు. ఒక విధంగా రెజ్లర్ గా మారిపోయాడు అఖిల్ అంటున్నారు.

అఖిల్ తో మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీస్తున్న ఏజెంట్ మూవీ కోసం అఖిల్ పడుతున్న కష్టం చూస్తూంటే మాస్ ఇమేజ్ మీద తపన ఏ రేంజిలో ఉందో అర్ధమవుతోంది. అఖిల్ అంటే చాక్లెట్ బాయ్ గానే ఇప్పటిదాకా గుర్తింపు ఉంది. అంతే కాదు అఖిల్ లవర్ బాయ్ అంటారు. తండ్రి నాగార్జున ఎటూ రొమాంటిక్ కింగ్. దాంతో ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ అయిదు సినిమాలు చేశాడు. అయితే అందులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ తప్ప మరేమీ పెద్దగా తృప్తి ఇవ్వలేదు.

ఇక అక్కినేని వంశానికి ఉన్న క్లాస్ ముద్రను తొలగించాలని కూడా అఖిల్ గట్టిగానే కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఏజెంట్ తో ఏకంగా తన లుక్కే కాదు, బాడీ స్టైల్ ని కూడా మార్చేస్తున్నాడు. వర్కౌట్స్ హెవీగా చేస్తూ ఊర మాస్ గా మారిపోతున్నాడు. ఈ మూవీకి ఇది అవసరమని భావించడంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి సూచనలతో అఖిల్ సిక్స్ ప్యాక్ తో అదరహో అన్నట్లుగా తయారవుతున్నాడు.

అక్కినేని వంశానికి ఫస్ట్ టైమ్ ఊర మాస్ ఇమేజ్ ని తీసుకురావాలని అఖిల్ పడుతున్న తాపత్రయం చూస్తే ముచ్చటగానే ఉంది. అయితే ఒక్కసారి కనుక మాస్ ఇమేజ్ వస్తే దాని నుంచి బయటపడడం కష్టం. అదే సమయంలో చేయాల్సిన చాలా క్యారక్టర్లు కూడా సూట్ కాకుండా పోతాయన్న టాక్ కూడా ఉంది.

అఖిల్ ఏజ్ ఇంకా తక్కువే కాబట్టి ఆయన లవర్ బాయ్ ఇమేజ్ తో మరిన్నాళ్ళు ట్రావెల్ చేస్తే బాగుంటుంది అన్న వారూ ఉన్నారు. ఇక మాస్ మూవీస్ తోనే బాక్సాఫీస్ షేక్ చేయాలని అఖిల్ టార్గెట్ పెట్టుకున్నాడు. సో 2022లో వచ్చే ఏజెంట్ తో అఖిల్ పడుతున్న కష్టానికి ఫలితం వస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా అక్కినేని వారింట యువ రాజకుమారుడిగా ఉన్న అఖిల్ ఇలా మాస్ అప్పీల్ తో ముందుకు వస్తే హ్యూజ్ లేడీ ఫ్యాన్ మెయిల్ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఆసక్తికరంగానే ఉంది.


Tags:    

Similar News