గల్వాన్‌ వ్యాలీ ఘటన నేపథ్యంలో స్టార్ హీరో సినిమా...!

Update: 2020-07-04 10:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు 'మైదాన్' అనే స్పోర్ట్స్ డ్రామాలో కూడా అజయ్ దేవగన్ నటించాడు. ఈ సినిమా 2021 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది. ఇక 'భుజ్‌ : ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' పేరుతో మరో సినిమా కంప్లీట్ చేసాడు అజయ్. ఈ సినిమా అరుణాచల్‌ ప్రదేశ్‌ లో చైనా పీపుల్స్‌ ఆర్మీ భారత సైన్యంపై జరిపిన మెరుపుదాడి ఆధారంగా చేసుకొని రూపొందించారని సమాచారం. ఈ ఘటన భారత సైన్యం మొట్టమొదటి సారిగా ప్రాణనష్టం ఎదుర్కొన్న దాడిగా పేర్కొంటారు. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ క్రమంలో మరో వాస్తవ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు అజయ్ దేవగన్.

ఇటీవల లడఖ్‌ లోని గల్వాన్‌ వ్యాలీలో ఇండియా - చైనాల మధ్య చోటుచేసుకున్న సంఘర్షణ ఆధారంగా సినిమా రూపొందించనున్నట్లు అజయ్‌ దేవగన్ ప్రకటించారు. జూన్‌ 15న గాల్వన్‌‌ వ్యాలీ వద్ద చైనా ఆర్మీ భారత సైన్యంపై జరిపిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వీరిలో సూర్యాపేట వాసి కల్నల్‌ సంతోష్‌ బాబు కూడా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడం ప్రతి పౌరుడూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేసింది. అమ‌రులైన మ‌న వీర సైనికుల‌కి యావత్ దేశం ఘ‌న నివాళులు అర్పించింది.

ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా అజయ్‌ దేవగన్‌ నిర్మాతగా సినిమా తీయనున్నారు. అయితే ఇందులో అజయ్‌ దేవగన్ నటిస్తారా లేదా అనేది వెల్లడించలేదు. అయితే ఇప్పటికే ఈ చిత్రం కోసం తారాగణాన్ని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. అజయ్‌ దేవగన్‌ ఫిల్మ్స్‌ మరియు సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కాగా గతంలో వార్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' లాంటి సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News