మెగాఫోన్ పట్టిన ఫైట్ మాస్టర్.. జనవరిలో సినిమా రిలీజ్

Update: 2020-12-22 12:30 GMT
సినిమా ఇండస్ట్రీలో ఇతర విభాగాల్లో పనిచేసినవారు.. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో దర్శకరత్న దాసరి నారాయణరావు మొదలు.. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, కొరటాల శివ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే.. ఇప్పడు ఓ ఫైటర్ మెగా ఫోన్ పట్టారు.

పీటర్ హెయిన్స్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. ఆయన ఫైట్ కంపోజ్ చేస్తే.. హీరోల హీరోయిజం ‘అంతకు మించి’ అన్న రేంజ్ లో ఎలివేట్ అవుతుంది. దేశవ్యాప్తంగా గొప్ప యాక్షన్ డైరెక్టర్‌గా గొప్ప పేరు సంపాదంచుకొన్న పీటర్ హెయిన్స్.. దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తమిళ దర్శకుడు గౌత‌మ్ మీన‌న్ రూపొందించిన ‘చెలి’ మూవీతో ఫైట్ మాస్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించారు పీటర్. ఆ తర్వాత కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వహించిన ‘మురారి’తో టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ త‌ర్వాత దక్షిణాదిలో అప‌రిచితుడు, శివాజీ, గ‌జిని, మ‌గ‌ధీర‌, రోబో, విల‌న్‌, విక్ర‌మ సింహ‌, బాహుబ‌లి, మ‌న్యం పులి వంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పడు స్టార్ కెమెరా.. యాక్షన్ అనబోతున్నారు.

అయితే.. పీటర్ డైరెక్ట్ చేస్తున్నది తెలుగు సినిమా కాదు. ఒక వియత్నామీస్ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ‘సామ్ హోయి’ పేరుతో రూపొందుతోంది. ఈ కథ బాక్సింగ్ చుట్టూ తిరుగుతుంది. ఇండియా-వియత్నాం ఉమ్మడి నిర్మాణంగా ప్రకటించిన ఈ చిత్రం.. కొన్నేళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లింది. వాస్తవానికి 2017 లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులూ అధిగమించి 2021 జనవరి 15 న విడుదల కాబోతోంది. వియత్నాంతోపాటు ఇండియా, చైనాలోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీలో వియత్నాం నటులు బిన్ మిన్, అన్ థూ ప్రధాన పాత్ర పోషించారు. సాంకేతిక విభాగంలో పలువురు తమిళ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు.

కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఈ చిత్రం.. వీక్షకులను ఆకట్టుకుంది. మరి, రాబోయే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది? డైరెక్టర్ తన డెబ్యూ మూవీ పీటర్ కు ఎలాంటి బ్రేక్ ఇస్తుంది? అన్నది చూడాలి.
Tags:    

Similar News